సోఫా సెట్లు.. పూల గుచ్ఛాలు.. పుష్ప సినిమా మాదిరి విజయ్ రాజకీయాలు.. ఉదయనిధి కామెంట్స్ వైరల్

అసెంబ్లీ వేదికగా జరుగుతున్న బలపరీక్ష చర్చలు కాస్తా.. ఇద్దరు యువ నేతల మధ్య వ్యక్తిగత, రాజకీయ విమర్శల యుద్ధంగా మారాయి.

Update: 2026-05-13 07:14 GMT

తమిళనాడు రాజకీయ యవనికపై ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా యుద్ధ వాతావరణం నెలకొంది. అధికారం చేపట్టిన కొత్తలో ఉన్న ఉత్సాహం కంటే.. ఇప్పుడు కుర్చీని కాపాడుకోవాలనే తపన టీవీకే వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న బలపరీక్ష చర్చలు కాస్తా.. ఇద్దరు యువ నేతల మధ్య వ్యక్తిగత, రాజకీయ విమర్శల యుద్ధంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని సంధించిన విమర్శనాస్త్రాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని రేపుతున్నాయి.

ప్రజాభిమానం ఎక్కడ? ఉదయనిధి సూటి ప్రశ్న

సభలో ప్రసంగించిన ఉదయనిధి స్టాలిన్, టీవీకే ప్రభుత్వం యొక్క నైతికతను ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో టీవీకేకు వచ్చిన ఓట్ల శాతాన్ని విశ్లేషిస్తూ ఆయన గణాంకాలతో విరుచుకుపడ్డారు. "రాష్ట్రంలోని దాదాపు 65 శాతం మంది ఓటర్లు విజయ్ నాయకత్వాన్ని స్పష్టంగా తిరస్కరించారు. సుమారు 3.1 కోట్ల మంది ప్రజలు టీవీకేకు వ్యతిరేకంగా ఓటు వేశారంటే, అది ప్రజా వ్యతిరేకత కాక మరేమిటి?" అని ఆయన ప్రశ్నించారు.

అంతేకాకుండా విజయ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడాన్ని ఉదయనిధి తీవ్రంగా తప్పుబట్టారు. ఒకే స్థానం నుండి గెలుస్తాననే ధైర్యం లేని వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తూ.. "ముఖ్యమంత్రికి తనపై తనకే నమ్మకం లేదు.. అందుకే అస్థిరతతో రెండు చోట్ల బరిలోకి దిగారు" అని ఎద్దేవా చేశారు.

కూటమి మద్దతుతోనే మనుగడ..

టీవీకే ఒంటరిగా ప్రభుత్వాన్ని నడిపించే సత్తా లేని పార్టీ అని ఉదయనిధి వ్యాఖ్యానించారు. డీఎంకే కూటమిలోని కొన్ని కీలక పార్టీల మద్దతు లేకపోతే విజయ్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుందని ఆయన హెచ్చరించారు. "ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంపూర్ణ మెజారిటీతో ఏర్పడింది కాదు.. కేవలం కొన్ని పార్టీల ఊతకర్రల మీద నిలబడి ఉంది" అని విమర్శించారు.

సోఫా సెట్లు.. పూల గుచ్ఛాలు.. హార్స్ ట్రేడింగ్ కలకలం

అసెంబ్లీలో చర్చాంశం హార్స్ ట్రేడింగ్ (ఎమ్మెల్యేల కొనుగోలు) వైపు మళ్ళినప్పుడు ఉదయనిధి మరింత దూకుడు పెంచారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలను సీఎం విజయ్ వ్యక్తిగతంగా కలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "సీఎం పర్యటనకు ముందే సదరు ఎమ్మెల్యేల ఇళ్లకు సోఫా సెట్లు వెళ్తున్నాయి.. ఆ వెంటనే సీఎం పూల గుచ్ఛాలతో ప్రత్యక్షమవుతున్నారు. పుష్ప సినిమా తరహా రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్నారు. ఇది రాజకీయ నైతికతా లేక ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే వ్యూహమా?" అంటూ ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు సభలో కలకలం రేపాయి.

సభలో గందరగోళం.. వాకౌట్

ఉదయనిధి వ్యాఖ్యలను ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజ్ అడ్డుకోవడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం పెరగడంతో సభ నియంత్రణ తప్పింది. దీనికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేశారు. అసెంబ్లీ బయట కూడా ఇరు పార్టీల కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

మరోవైపు టీవీకే నేతలు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. డీఎంకే ఓటమిని జీర్ణించుకోలేక విజయ్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తోందని, ప్రజాతీర్పును అవమానించడం తగదని వారు హితవు పలుకుతున్నారు. ఏదేమైనా తమిళనాడు రాజకీయాల్లో ఈ 'కోలీవుడ్' వర్సెస్ 'ద్రవిడ' రాజకీయం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News