స్టాలిన్ జయలలిత రూటా లేక కరుణానిధి బాటా ?
తమిళనాడు ఎన్నికలల్లో ప్రజల తీర్పునకు రంగం సిద్ధం అయింది. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ ప్రజలు తమ తీర్పుని వెలువరించబోతున్నారు.;
తమిళనాడు ఎన్నికలల్లో ప్రజల తీర్పునకు రంగం సిద్ధం అయింది. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ ప్రజలు తమ తీర్పుని వెలువరించబోతున్నారు. మొత్తం 6 కోట్ల 27 లక్షల ఓటర్లు తమిళనాడులో రాబోయే ప్రభుత్వం ఏదో చాటి చెప్పనున్నారు. ఇందులో 3. 14 కోట్ల మంది పురుషులు అయితే 3.9 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు 21 లక్షల మంది అయితే యువ ఓటర్లు 87 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2021 ఎన్నికల్లో 72.8 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఆ శాతం పెరిగే చాన్స్ ఉంది అని అంటున్నారు.
మైకులు మూగబోయాయి :
ఇదిలా ఉంటే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి మంగళవరం సాయంత్రం ఆరు గంటల అడ్డుకట్ట పడింది. ఇప్పటిదాకా మోగిన మైకులు అన్నీ ఒక్కసారిగా మూగపోయాయి. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో తీవ్రమైన ప్రచారం సాగింది. అధికార డీఎంకే తరఫున స్టాలిన్ ఏకంగా 130 సీట్లలో ప్రచారం చేస్తే ప్రతిపక్ష నాయకుడు పళని స్వామి 100 సీట్లకు పైగా ప్రచారం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర నాయకుడు అన్నామలై కూడా వంద దాకా సీట్లలో ప్రచారం చేస్తే ఎన్డీయే తరఫున చంద్రబాబు 15 సీట్లలో ప్రభావం అయ్యేలా ప్రచారం చేపట్టారు. ఇక టీవీకే తరఫున అధినేత సినీ నటుడు విజయ్ వందకు పైగా అసెంబ్లీ సీట్లలో ప్రచారం చేపట్టారు.
డీఎంకే మీదనే గురి :
అటు టీవీకే కానీ అన్నా డీఎంకే కానీ బీజేపీ కానీ డీఎంకే మీదనే గురి పెట్టాయి. రాష్ట్రంలో డీఎంకే అత్యంత అధ్వాన్నమైన పాలన సాగిందని వారి పాలనలో గ్రామ పంచాయతీ స్థాయి వరకు వంశపారంపర్య పాలన పాకిందని ఎన్డీయే నేతలు తీవ్ర విమర్శలు చేశారు. శాంతిభద్రతల క్షీణతకు, మహిళలపై నేరాల పెరుగుదలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు డీఎంకేని తిరస్కరించాలని కోరారు. మరో వైపు చూసెత డీఎంకే ప్రభుత్వం వల్లే తమిళనాడు అభివృద్ధి చెందుతోందని ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి మద్దతుగా చేసిన ప్రచారంలో చెప్పుకొచ్చారు.
భీకరమైన పోరు :
ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో భీకరమైన పోరు సాగింది. ఇది స్థూలంగా త్రిముఖ పోటీలా రాష్ట్ర స్థాయిలో కనిపిస్తున్నా కొన్ని నియోజకవర్గాల్లో నాలుగు లేదా ఐదుగురి అభ్యర్థులు పార్టీల మధ్య పోటీలా కూడా ఉంది. ఇక తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడం ఓటర్ల ఇష్టం. ప్రచార చివరి రోజున సైతం అన్ని పార్టీలూ హోరెత్తించాయి. వేసవి తీవ్రత కూడా ఏ మాత్రం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం చేశారు.
స్టాలిన్ రెండోసారి :
తమిళనాడులో ఒక ట్రెడిషన్ ఉంది. ఒక పార్టీకి ఒక చాన్స్ మాత్రమే ఇస్తారు. మరో ఎన్నికల్లో ఓడిస్తారు. అది ఎంత బాగా పాలన చేసినా కూడా ప్రజలు మార్పుని కోరుకోవడం వల్లనే జరిగే పరిణామం. ఎంజీఆర్ అయితే రెండు సార్లు వరసగా గెలిచారు. ఇక జయలలిత 2011, 2016లో వరసగా గెలిచారు. కరుణానిధి హయాంలో మాత్రం ఆ మ్యాజిక్ సాధ్యపడలేదు. ఆయన 1969లో తొలిసారి సీఎం అయ్యారు. అది అన్నాదురై మరణం తరువాత. ఆయన నాయకత్వంలో 1972లో ఒకసారి గెలిచారు 1977 లోకి వచ్చేసరికి ఎంజీఆర్ అన్నా డీఎంకే చేతిలో ఓటమి పాలు అయ్యారు. జయలలిత రంగ ప్రవేశం చేశాక ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీ గెలవడం జరుగుతూ వచ్చింది. దానిని జయలలిత ఒక్కరే బ్రేక్ చేయగలిగారు. మరి స్టాలిన్ ఏ విధంగా చేస్తారు అన్నదే చర్చ. ఆయన తన తండ్రి కరుణానిధి బాటలో నడిస్తే ఈసారి ఎన్నికల్లో డీఎంకేకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా జయలలిత మాదిరిగా మరోసారి గెలిస్తే మాత్రం రికార్డు ని క్రియేట్ చేసినట్లే. చూడాలి మరి ఏమి జరుగుతుందో.