కిడ్నీ దానంపై ప్రేమానంద్ జీ మహరాజ్ ఏమన్నారంటే..?
ధరిత్రి ఏర్పడిన తర్వాత వచ్చిన ధర్మం ‘సనాతనం’. సనాతనం అంటేనే ఆది అంతం లేనిదని అర్థం.;
ధరిత్రి ఏర్పడిన తర్వాత వచ్చిన ధర్మం ‘సనాతనం’. సనాతనం అంటేనే ఆది అంతం లేనిదని అర్థం. అలాంటి గొప్ప ధర్మం చెట్టుగా భావిస్తే పెద్ద పెద్ద శాఖలే ఆధ్యాత్మిక గురువులు. వారి ప్రసంగాలు.. వారి నడవడి.. లోకానికి జ్ఞానాన్ని పంచుతుంది. ఇలా ఒక కల్పవృక్షానికి ఎంతో మంది రుషులు శాఖలుగా ఉన్నారు. కాబట్టే.. ఎన్నో గ్రంథాలు, మనుషి నడవడి విధి విధానాలు రూపొందించబడ్డాయి. అలాంటి గురు పరంపరంలో ఒకరు స్వామ ప్రేమానంద్ జీ మహరాజ్.
ఆధ్యాత్మిక భావజాలానికి ప్రతీక
భారతదేశం ఆధ్యాత్మిక భావజాలానికి ప్రతీకగా నిలిచిన ప్రేమానంద్ జీ మహరాజ్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్నారు. ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అందుకే ఆయన కిడ్నీలకు రాధా, కృష్ణ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఈ వార్త కేవలం ఒక గురువు అనారోగ్యానికి సంబంధించినది కాదు అది దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనసుల్లో ఒక ఆధ్యాత్మిక ప్రకంపన. ప్రేమానంద్ మహరాజ్ పేరు, ఆయనపై భక్తులకు ఉన్న ప్రీతి, ఆయన ప్రవచనాల ప్రభావం ఇవన్నీ కలిసి ఆయన అనారోగ్యాన్ని ఒక సామూహిక అనుభూతిగా మార్చేశాయి.
నిత్యం డయాలసిస్ పైనే..
బృందావన్ (వృందావన్) లోని తన ఆశ్రమంలో డయాలసిస్‌పై ఆధారపడుతున్న మహరాజ్, ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌తో మాట్లాడినప్పుడు తన స్థితిని ఎంతో నిశ్చలంగా, తత్వబోధకంగా వివరించారు. ‘నా రెండు కిడ్నీలు పనిచేయడం లేదు. వైద్యపరంగా నేను తిరిగి కోలుకునే అవకాశం లేదు. ఈ రోజు కాకపోయినా రేపు వెళ్లిపోవాలి’ అని ఆయన చెప్పినప్పుడు అది కేవలం ఒక ప్రకటన కాదు.. మానవ అశాశ్వతతపై ఒక గంభీర ధ్యానం. ఆయన మాటల్లో భయం లేదు.. కేవలం ఒక అంగీకారం తప్ప. జీవితం ఒక యాత్ర మాత్రమేనని, అది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలుసని ఆయన అన్నారు.
కన్నీటి పర్యంతం అవుతున్న భక్తులు..
మహరాజ్ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తతో దేశం మొత్తం ఒక్కసారిగా స్పందించింది. సోషల్ మీడియాలో భక్తుల ప్రార్థనలు, కన్నీటి సందేశాలు వెల్లువెత్తాయి. కానీ ఈసారి ప్రతిస్పందన కేవలం భక్తులకే పరిమితం కాలేదు. బాలీవుడ్ నటుడు శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా స్వయంగా వృందావన్ చేరి తన కిడ్నీని దానం చేస్తానని ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముస్లిం యువకుడు ఆరిఫ్ ఖాన్ చిష్తీ కూడా తన కిడ్నీని దానం చేస్తానని లేఖ రాశాడు. ఈ నిర్ణయం మతాల మధ్య ఉన్న సరిహద్దులను చెరిపేసి, మానవత్వం ముందు మతం ఎంత చిన్నదో గుర్తు చేస్తుంది. నటుడు అజాజ్ ఖాన్ కూడా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ ముందుకొచ్చాడు. కానీ వారి సుందరమైన భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకున్న మహరాజ్ వారి అభ్యర్థనలను తిరస్కరించారు.
ఆయన ఆధ్యాత్మిక వైపు ఎలా వెళ్లారు..
ప్రేమానంద్ జీ మహరాజ్ అసలు పేరు ‘అనిరుద్ధ కుమార్ పాండే’. బాల్యంలోనే ఆయన భక్తి మార్గాన్ని ఎంచుకున్నారు. వేదాలు, గీత, భజనల పట్ల ఆసక్తి ఆయనలో భక్తి స్ఫూర్తిని పెంచింది. యువకుడైన తర్వాత కుటుంబాన్ని వదిలి వేదాంతం పట్ల అంకిత భావంతో వారణాసికి చేరుకున్నారు. అక్కడ సాధువులతో గడిపిన ఆధ్యాత్మిక జీవనం ఆయనలో అంతర్గతంగా తీవ్ర ప్రకంపనలను తీసుకువచ్చింది. దీంతో ఆయన మారిపోయారు. రాధా వల్లభ్ సంప్రదాయంలో ప్రవేశించి మోహిత్ గోస్వామి వద్ద దీక్ష తీసుకొని ప్రేమానంద్‌గా మారారు.
రెండు దశాబ్దాలుగా యువతలో ఆధ్యాత్మిక ప్రేరణ..
రెండు దశాబ్దాలుగా ఆయన ప్రసంగాలు భారత యువతను లోతుగా ప్రభావితం చేశాయి. విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ వంటి ప్రముఖులు కూడా ఆయన ఉపన్యాసాల ప్రభావాన్ని బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆయన భక్తి వేదిక కేవలం పూజా స్థలం కాదు.. ఒక ఆలోచన స్థలం. ఆయన గీతలో చెప్పిన ‘నిస్వార్థ ప్రేమే భక్తి’ అనే భావజాలం, క్రమంగా మతాలను మించి మానవ బంధాల గొప్పతనాన్ని వివరించింది.
ఆయన ఆరోగ్యంపై ప్రార్థనలు..
ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రపంచ వ్యాప్తంగా భక్తులు మౌన ప్రార్థనల్లో మునిగిపోయారు. ఈ ఘటన మనకు ఒక పెద్ద ప్రశ్నను కూడా ఉంచుతోంది. మానవ దేహం అశాశ్వతం, కానీ మానవత అనే శక్తి ఎందుకు ఇంత శాశ్వతంగా అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు ప్రేమానంద్ జీ మహరాజ్ జీవితమే సమాధానం. ఆయన బోధనలో, ఆయన ప్రశాంత ముఖంలో, ఆయన అనారోగ్యాన్ని ధ్యానంలా స్వీకరించే ధైర్యంలో ఒక తాత్విక గీత నడుస్తోంది.