రఘురామ కేసులో కీలక మలుపు.. సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ఈ కేసులో ఇప్పటికే విజయపాల్, డాక్టర్ ప్రభావతిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా రఘురామ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.;
సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ గుంటూరు సీసీఎస్ పోలీసుస్టేషన్ లో పోలీసు విచారణ ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ పై గత ఏడాది కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్ ను ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. గత నెల 26న తొలి నోటీసు ఇవ్వగా, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా సునీల్ కుమార్ హాజరుకాలేదు. దీంతో సోమవారం విచారణకు రమ్మంటూ ఈ నెల 6న విచారణాధికారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే సునీల్ కుమార్ దర్యాప్తు అధికారి దామోదర్ ఎదుట హాజరయ్యారు.
గుంటూరు సీసీఎస్ పోలీసుస్టేషన్ లో సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. డీజీపీ ర్యాంకులో ఉన్న సునీల్ కుమార్ విచారణపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రఘురామపై 2021లో అప్పటి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ దేశద్రోహం కేసు నమోదు చేశారు. రఘురామ పుట్టినరోజు నాడే అంటే మే 14న అరెస్టు చేసి అదేరోజు రాత్రి కస్టడీలో హింసించినట్లు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ తోపాటు మాజీ సీఎం జగన్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ ఏఎస్పీ విజయపాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిపై రఘురామ ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఇప్పటికే విజయపాల్, డాక్టర్ ప్రభావతిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా రఘురామ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ఏడాది జులై 11న గుంటూరు పోలీసులు రఘురామ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఇందులో సునీల్ కుమార్ ఏ1గా ఉండగా, పీఎస్ఆర్ ఆంజనేయులు ఏ2, మాజీ సీఎం జగన్, సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్, డాక్టర్ ప్రభావతి వరుసగా ఏ3 నుంచి ఏ5గా ఉన్నారు. ఇక ఇదే కేసులో రఘురామపై దాడి చేసిన నిందితుడు తులసిబాబును కూడా గతంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు తులసిబాబు ఏ1 సునీల్ కుమార్ కు అనుచరుడిగా రఘురామ చెబుతున్నారు.
ఇక తీవ్ర ఉత్కంఠ, అనేక అనుమానాల మధ్య సునీల్ కుమార్ సోమవారం విచారణకు వచ్చారు. రఘురామపై అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో దేశద్రోహం కేసు నమోదు చేయడంతోపాటు కస్టోడియల్ టార్చర్, భౌతిక దాడి ని లైవ్ లో వీడియో చూపించారనే అభియోగాలు సునీల్ కుమారుపై ఉన్నాయి. దీనిపై దర్యాప్తు అధికారి ఎలాంటి ప్రశ్నలు వేస్తారు? దానికి సునీల్ కుమార్ చెప్పే సమాధానాలు ఏంటి అన్నది ఆసక్తి రేపుతున్నాయి. రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని గత ప్రభుత్వంలోనే నిర్ధారణ అయింది. అప్పట్లో ఎంపీగా ఉన్నరఘురామరాజును కోర్టు ఆదేశాలతో పరీక్షించిన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు లాఠీలు, రబ్బరు బెల్టులతో రఘురామపై దాడి చేశారని నిర్ధారిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారని చెబుతున్నారు. ప్రస్తుత కేసులో ఆర్మీ ఆస్పత్రి డాక్టర్ల నివేదిక కీలకంగా మారిందని చెబుతున్నారు. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.