ప్రభాస్ నా క్లాస్‌మేట్.. టీడీపీ ఎమ్మెల్యే భావోద్వేగం

ఇటీవల కొన్ని రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన పాత జ్ఞాపకాలలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.;

Update: 2025-12-03 07:32 GMT

ఇటీవల కొన్ని రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన పాత జ్ఞాపకాలలో ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మధుర జ్ఞాపకాలు, మిత్ర బృందంలో ప్రముఖ వ్యక్తుల విశేషాలు వెల్లడించారు. ఇందులో పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ తో తన చిన్ననాటి స్నేహితుడని.. తామిద్దరం తరచూ కలుస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రభాస్ లోని కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పడం ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్ నలందాలో ఇంటర్ చదవేటప్పుడు ప్రభాస్ తన క్లాస్‌మేట్ అని సుధీర్ రెడ్డి వెల్లడించారు. తమ ఇద్దరికి యూవీ క్రియేషన్స్ వంశీ కామన్ ఫ్రెండ్ అని సుధీర్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ లో తన ఫ్రెండు అయిన ప్రభాస్ మంచి ఫుడ్డీ అని, ఆయన ఆతిథ్యం చాలా బాగుంటుందని సుధీర్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభాస్ కొంచెం తింటున్నారని, తమకు మాత్రం బాగా తిండిపెడుతుంటారని సుధీర్ రెడ్డి తెలిపారు.

ఇటీవల తాను ప్రభాస్ ను కలిసినప్పుడు ఎమ్మెల్యేగారూ అని పిలిచాడని, ఆ పిలుపు తనను ఎంతో ఇబ్బంది పెట్టిందని సుధీర్ రెడ్డి తన స్నేహితుడి పిలుపులో మధురానుభూతిని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అని.. తామంతా లోకల్ స్టార్స్ అంటూ సుధీర్ రెడ్డి గొప్పగా చెప్పారు. తమ చిన్నతనంలో ప్రభాస్ బాగా బొద్దుగా ఉండేవారని, తామంతా మోటార్ సైకిళ్లపై సరదాగా తిరిగేవారమని అప్పటి విశేషాలను సుధీర్ రెడ్డి వెల్లడించారు.

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడైన సుధీర్ రెడ్డి గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పలుమార్లు ఆయన ప్రభాస్ ను కలిశారు. ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ప్రభాస్ తన క్లాస్‌మేట్ అన్న విషయాన్ని చెప్పినా, అప్పుడు పెద్దగా ఎవరి దృష్టిని ఆకర్షించలేదు. కానీ, తాజా ఇంటర్వ్యూలో మరోసారి ప్రభాస్ తో తన స్నేహాన్ని ఆయన వివరించిన తీరు, ఇంటర్వ్యూలో ఆ విషయాన్నే ఎక్కువగా హైలెట్ చేయడంతో వైరల్ గా మారింది.

Tags:    

Similar News