చరిత్ర : అతిపెద్ద పార్టీ కాదు.. మెజారిటీదే అధికారం! బొమ్మై కేసుతో టీవీకే విజయ్ కు కొండంత బలం..
తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్న వేళ, రాజ్యాంగ నిబంధనలు.. గవర్నర్ విచక్షణాధికారాల మధ్య యుద్ధం మొదలైంది.;
తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్న వేళ, రాజ్యాంగ నిబంధనలు.. గవర్నర్ విచక్షణాధికారాల మధ్య యుద్ధం మొదలైంది. ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేని సమయంలో గవర్నర్ ఎవరిని ఆహ్వానించాలి? అతిపెద్ద పార్టీనా లేక కూటమిగా ఏర్పడిన పక్షాలనా? అనే ప్రశ్నలకు 1994 నాటి ఎస్.ఆర్. బొమ్మై కేసు కీలక సమాధానంగా నిలుస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉత్కంఠభరిత పరిస్థితులు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడంపై గవర్నర్ తీరును విమర్శిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఎస్.ఆర్. బొమ్మై తీర్పును తెరపైకి తెచ్చాయి.
ఎస్.ఆర్. బొమ్మై తీర్పు నేపథ్యం
1988-89లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్.ఆర్. బొమ్మైకి ఎమ్మెల్యేల మద్దతు లేదన్న కారణంతో గవర్నర్ సిఫార్సు మేరకు కేంద్రం ఆర్టికల్ 356 ఉపయోగించి ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన బొమ్మైకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. "ఒక ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో తేల్చాల్సింది రాజ్‌భవన్‌లో కాదు.. అసెంబ్లీ వేదికగా జరగాలి. గవర్నర్ తన వ్యక్తిగత అంచనాల ఆధారంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయలేరు" అని కోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం తమిళనాడులో టీవీకే చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో ఇదే అంశం ప్రధానాస్త్రంగా మారింది. గవర్నర్ రాజేంద్ర అర్లెకర్ స్పందిస్తూ "మెజారిటీ నిరూపిస్తే ఎవరికైనా అవకాశం ఇస్తాను" అని ప్రకటించినప్పటికీ అతిపెద్ద పార్టీని విస్మరిస్తున్నారంటూ కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వివాదంలోకి నటులు కమలహాసన్, ప్రకాష్ రాజ్, విశాల్ వంటి ప్రముఖులు ప్రవేశించడం గమనార్హం.
గత అనుభవాలు.. అతిపెద్ద పార్టీల వైఫల్యం
భారత రాజకీయ చరిత్రలో కేవలం అతిపెద్ద పార్టీగా అవతరించినంత మాత్రాన ప్రభుత్వం నిలబడదని అనేక ఉదాహరణలు నిరూపించాయి.. 1996 లో వాజ్‌పేయి ప్రభుత్వం 161 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా, పూర్తి మెజారిటీ లేని కారణంగా ఈ ప్రభుత్వం కేవలం 13 రోజుల్లోనే కుప్పకూలింది.1998 లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఒక అడుగు ముందుకేసి, మద్దతు ఇస్తున్న పార్టీల నుంచి లిఖితపూర్వక లేఖలు కోరిన తర్వాతే ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. 2018లో కర్ణాటక లో 104 సీట్లు సాధించిన బీజేపీని గవర్నర్ ఆహ్వానించగా యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కాంగ్రెస్-జేడీఎస్ ఐక్యత ముందు తలవంచి బలపరీక్షకు ముందే ఆయన వైదొలిగారు. 2019లో మహారాష్ట్ర 'అర్ధరాత్రి' ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా గవర్నర్ కోష్యారి నియమించినా, ఆ ప్రభుత్వం కేవలం నాలుగు రోజులు మాత్రమే కొనసాగింది.
మెజారిటీయే అంతిమ సూత్రం
ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే-ఏఐఏడీఎంకే వంటి విరుద్ధ ధ్రువాలు కూడా పొత్తు దిశగా ఆలోచిస్తున్నాయన్న ఊహాగానాల మధ్య గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. రాజ్యాంగ ధర్మం ప్రకారం.. మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్న నేతకే ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కంటే మరేదీ ముఖ్యం కాదని.. బొమ్మై తీర్పు ఇప్పటికీ దేశ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తూనే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ మాత్రమే ఏ పక్షానికి అసలైన బలం ఉందో తేల్చనుంది. గవర్నర్ తన విచక్షణ అధికారులతో తనే సుప్రీం కాకుండా అసెంబ్లీలోనే బలనిరూపణకు అవకాశం ఇవ్వాలి. అప్పటివరకు తమిళనాడు రాజకీయం ఉత్కంఠభరితమైన చదరంగంలానే కొనసాగనుంది.