సోనియా గాంధీ ఇక జైపూర్ లోనే.. కారణమిదే!
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యపూరిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యపూరిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీ రికార్డులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కాలుష్యం ధాటికి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలను ఆలస్యంగా తెరవడం మొదలుపెట్టారు. విపరీతమైన పొగతో విమానాల రాకపోకల సమయాల్లోనూ మార్పులు చేశారు.
చివరకు కాలుష్యం విషయంలో సుప్రీంకోర్టే జోక్యం చేసుకునే వరకు పరిస్థితి చేయిదాటింది. కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని సుప్రీంకోర్టు తలంటింది. పంజాబ్, హరియాణాల్లో రైతులు పొలాల్లో గడ్డిని తగలబెడుతుండటం వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని.. దీని నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
అయితే రెండు వారాలుగా వేధిస్తున్న ఢిల్లీ కాలుష్యం ఇటీవల ఎట్టకేలకు కొంతవరకు తగ్గింది. వర్షాలు కురియడంతో కాలుష్యం చాలా వరకు తగ్గిపోయింది. ఈ మేరకు గాలి నాణ్యత పెరిగింది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. దీంతో రాజధాని వాసులు ఎట్టకేలకు ‘ఊపిరి’పీల్చుకున్నారు.
అయితే దీపావళి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో మళ్లీ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. బాణసంచా కాల్చవద్దని ప్రభుత్వం విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో వాయు కాలుష్యం మళ్లీ పెరిగింది. దీంతో కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఢిల్లీని విడిచిపెట్టారు. ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్నారు.
సోనియాగాంధీ ఇక జైపూర్ లోనే ఉంటారని టాక్ నడుస్తోంది. 76 ఏళ్ల సోనియా ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో ఆమె అక్కడ ఉండకూడదని నిశ్చయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి జైపూర్ కు చేరుకున్నారని అంటున్నారు.
గతంలోనూ ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో కొద్ది రోజులు సోనియాగాంధీ గోవాలో ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గాక అక్కడకు వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా ఇదే కోవలో ఆమె జైపూర్ చేరుకున్నారని చెబుతున్నారు. అక్కడ కూడా కొద్ది రోజులు ఉంటారని, ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గాక మళ్లీ అక్కడకు వెళ్లిపోతారని అంటున్నారు.