భద్రతలో మన నగరాలకు మహిళా టూరిస్ట్ ర్యాకింగ్.. ఏ నగరం ఎంత సేఫ్ అంటే..?

ఎమ్మా ఇన్‌స్టాగ్రామ్‌లో @discoverwithemma_ పేరుతో గుర్తింపు పొందిన యువతి. భారతదేశంలోని పలు నగరాల్లో పర్యటించి ఆయా నగరాలకు ర్యాకింగ్ ఇచ్చింది.;

Update: 2025-10-25 14:30 GMT

ప్రపంచంలో కొన్ని కొన్ని దేశాల్లో టూరిస్ట్ ప్లేస్ లు ఉంటాయి. కానీ అవి కొన్నింటికే పరిమితంగా ఉంటాయి. కానీ భారత్ మాత్రం అలా కాదు.. ఇక్కడ టూరిస్ట్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి ప్లేస్ కు ఒక సంస్కృతిక చరిత్ర ఉంటుంది. అందుకే ఇక్కడి ప్లేస్ లను విజిట్ చేసేందుకు ప్రపంచం నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. ఇలా వచ్చిన టూరిస్టులు మన దేశం గురించి మాట్లాడితే మనకు గర్వంగా ఉంటుంది. ‘ఇండియా కల్చర్‌, కలర్స్‌, స్పైసెస్‌, స్పిరిచువాలిటీ’ అని వారు చెబితే మన మనస్సు పొంగిపోతుంది. కానీ అదే విదేశీ మహిళా పర్యాటకురాలు ‘భారత్‌ అద్భుతం కానీ భద్రత భయంకరం’ అని చెప్తే.. ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఎవరో కొంత మంది చేసే వెకిలి చేష్టలతో దేశానికి ఇబ్బంది వస్తుంది. థాయ్‌లాండ్‌కు చెందిన సోలో ట్రావెలర్‌ ‘ఎమ్మా’ చెప్పిన మాటలు భారత్ లో టూరిస్టుల భద్రత గురించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది.

ఎమ్మా ఇన్‌స్టాగ్రామ్‌లో @discoverwithemma_ పేరుతో గుర్తింపు పొందిన యువతి. భారతదేశంలోని పలు నగరాల్లో పర్యటించి ఆయా నగరాలకు ర్యాకింగ్ ఇచ్చింది. ఆమె చెప్పిన మాటలు మనకు ఇష్టం లేకపోవచ్చు.. కానీ అవి నిజాలు. ‘భారతదేశం అందమైన దేశం.. కానీ అన్ని నగరాలు ఒకలా లేవు’ అని ఎమ్మా చెప్పింది.

ఏ నగరానికి ఎంత ర్యాంక్ ఇచ్చిందంటే..?

ఎమ్మా ఆయా నగరాలను ఇలా అంచనా వేసింది. కేరళను ఆమె అత్యంత భద్రతమైనది గుర్తించింది. 10 మార్కులకు 10 వేసింది. కేరళలో ప్రజల వ్యవహారం ప్రశాంతంగా ఉందని, విదేశీయులను హృదయ పూర్వకంగా స్వాగతిస్తారని ఆమె చెప్పుకచ్చింది. అక్కడి పర్యావరణం, ప్రజల గౌరవప్రదత ఆమెను ఆకట్టుకుంది. రెండో స్థానంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌, ఆ తర్వాత పుష్కర్‌, జైపూర్‌, గోవా లాంటి నగరాలు నిలిచాయి.

ఆర్థిక నగరంపై ఆందోళన..

కానీ ముంబై, ఆగ్రా, ఢిల్లీ విషయంలో ఆమె అనుభవాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆగ్రాలో శబ్ధ కాలుష్యం, పర్యాటకులను మోసం చేసే స్కాములు ఎక్కువగా జరుగుతున్నాయి. ముంబైలో గందరగోళం, రాత్రివేళ భయం ఢిల్లీలో అయితే, ‘ఒంటరి మహిళ వెళ్లకపోవడమే మంచిది’ అని ఆమె చెప్పింది. ఈ వ్యాఖ్య ఒక్కటే మన నగరాల భద్రతా స్థాయిని చెబుతుంది.

ఆత్మపరిశీలన అవసరం..

ఎమ్మా ర్యాంకింగ్స్‌పై సోషల్‌ మీడియాలో రెండు రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. కొందరు ఆమెను విమర్శించారు ‘ఇది ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే, దేశాన్ని దూషించడమేంటి?’ అని. కానీ మరోవైపు ఆమె నిజాయితీని మెచ్చుకున్నారు. నిజం చెప్పిన వాళ్లను విమర్శించడం మనకు అలవాటు. కానీ ప్రశ్నించాల్సింది మన మనస్తత్వాన్ని. పర్యాటకురాలిని చూసి ఆమె ఫొటో తీయమని బలవంతపెట్టడం, వెకిలి చేష్టలు, వ్యాఖ్యలు చేయడం, తాకుతూ వెళ్లడం ఇవన్నీ సమాజంలో సాధారణమైపోయాయి. మహిళల భద్రత కేవలం చట్టాలతో కాదు.. ప్రవర్తనతో మొదలవుతుంది.

‘సేఫ్టీ యాప్‌’ కంటే సానుభూతి అవసరం

ఎమ్మా పోస్ట్‌ వైరల్‌ అయిన తర్వాత ఆయా రాష్ట్రాల టూరిజం బోర్డులు స్పందించాయి. మహిళల భద్రతకు కొత్త చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి. కానీ భద్రతా చర్యలు అనేవి పోలీసు పెట్రోలింగ్‌తోనే కాదు.. మన మానవత్వంతో ప్రారంభం అవుతుంది. ఒక విదేశీ పర్యాటకురాలు మన దేశానికి వస్తే.. ఆమె కేవలం అతిథి కాదు ఆమె మన దేశ ప్రతిష్ఠ. మన నగరంలో ఆమెకు భయం లేకుండా భరోసా కలిగించడం మన బాధ్యత.

మహిళల భద్రత విషయంలో మరింత మారాలి..

మన దేశం ఎన్ని రకాల భాషలు, మతాలు, సంస్కృతులతో నిండిపోయినా.. మహిళ భద్రత విషయంలో మనం ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నామనే సత్యం గ్రహించాలి. ‘అతిథి దేవో భవ’ అనే మాట బోర్డుపై ఉంది, కానీ ఆ ప్రవర్తన రోడ్డుపై లేదు. ఎమ్మా ఇచ్చిన ఈ ర్యాంకింగ్‌లను మనం అవమానంగా కాకుండా అవగాహనగా తీసుకోవాలి. ఎందుకంటే పర్యాటకం మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఒక విదేశీ అమ్మాయి మన దేశాన్ని ‘సేఫ్‌ డెస్టినేషన్‌’గా చెబితే, అది మన అందరి గౌరవం.. కానీ ఆమె భయంతో తిరిగి వారి దేశానికి వెళ్లిపోతే అది మన అపమానంగానే భావించాలి.

ఎమ్మా మాటలు పట్టించుకోవాలి..

ఎమ్మా మాటలు పట్టించుకోవాలి. ‘మహిళలు సురక్షితంగా లేరు’ అని ఒక విదేశీ చెబితే చాలా అవమానంగా ఫీల్ అవ్వాలి. మహిళా సీఎం ఉన్న ఢిల్లీ లాంటి నగరాల్లోనే రాత్రి బయటకు వెళ్లద్దంటూ ఎమ్మా పేర్కొనడం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. తాజ్‌మహల్‌ అందంతో కాదు, మన ప్రవర్తనతో గుర్తించబడాలి. దేశం నిజంగా అద్భుతం కావాలంటే రోడ్ల పక్కన చెత్త వేయకపోవడమే కాదు.. పక్కన నడిచే మహిళకు గౌరవం ఇవ్వడమే నిజమైన ‘స్వచ్ఛ భారత్‌’.



Tags:    

Similar News