జూబ్లీ ఉప ఎన్నిక: నేతల్లో టెన్షన్.. టెన్షన్..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య కీలక పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.;
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. 4 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య కీలక పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి తోడు మరో 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. కులాలు, మతాలు, విద్యార్థి సంఘాలు ఇలా రకరకాలుగా అభ్యర్థులు చీలిపోయి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆది నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించడం లేదన్నది రాజకీయ వర్గాలు చెబుతున్న మాట.
ఈ నేపథ్యంలో ఇప్పుడు నేరుగా అభ్యర్థులతో పాటు పార్టీ కీలక నాయకులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఓటర్లు విరివిగా రావాలని.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థులు విన్నవిస్తున్నారు. పరవైపు కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద మాత్రమే ఓటర్లు క్యూ కట్టి కనిపిస్తుండగా మరికొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద మాత్రం కేవలం భద్రతా సిబ్బంది మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాస్ ఓటర్లపై పార్టీలకు భారీ అంచనాలు ఉన్నాయి. వారు కచ్చితంగా ఓటు వేస్తారని భావించారు.
కానీ అనూహ్యంగా మాస్ ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో.. బోరబండ, రహమత్ నగర్ వంటి చోట్ల పోలింగ్ బూత్ లో పెద్దగా ఓటర్లు కనిపించడం లేదు. ఇది పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. ఉదయం 11 గంటల సమయానికి కేవలం 20.1 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. మరి ప్రజల్లో నెలకొన్న నిరాశకు లేదా వారికి ఉన్న అభిప్రాయాలకు ఇది అడ్డం పడుతుందా లేక పార్టీల విషయంలో ప్రజలు చూపిస్తున్న నైరాశ్యానికి ఉదాహరణగా నిలుస్తుందా అనేది తేలాల్సి ఉంది.
ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ప్రచారం జరగడం, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడం, ఓటర్లను ఆకర్షించేలా నాయకులు ఇంటింటికీ తిరగడం వంటివి జరిగినా చివరి రోజు మాత్రం ప్రజల్లో ఎందుకో ఆ తరహా ఇంట్రెస్ట్ అయితే పెద్దగా కనిపించడం లేదన్నది స్పష్టం అవుతోంది. మరి దీనికి కారణాలు ఏంటి చివరి నిమిషంలో పుంజుకుంటారా అనేది చూడాలి.