పతనం అంచునుంచి శాసించే స్థాయికి.. 'రాయల్ ఎన్‌ఫీల్డ్' గ్రేట్ కంబ్యాక్ స్టోరి!
నేడు భారతదేశంతో పాటు చాలా దేశాలలో దేశీ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అజేయంగా హవా సాగిస్తోంది.;
నేడు భారతదేశంతో పాటు చాలా దేశాలలో దేశీ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ అజేయంగా హవా సాగిస్తోంది. దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ గురించి తెలుసుకుంటే ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి...!
ఆల్మోస్ట్ కథ ముగిసిపోయింది అని తీసిపారేసారు. కానీ ముగిసిపోయిన కథలో అసలు సిసలు ఊహించని ట్విస్టు కూడా ఉంది! పతనం అంచున ఉన్న ఒక సాదాసీదా మోటార్‌సైకిల్ బ్రాండ్.. నేడు ప్రపంచవ్యాప్తంగా ఒక కల్ట్ ఐకాన్‌గా ఎలా ఎదిగిందనేది ది గ్రేట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంబ్యాక్ జర్నీ చెబుతుంది. 2000వ సంవత్సరంలో సిద్ధార్థ లాల్ ఈ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించినప్పుడు కంపెనీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నాణ్యత లేని విడిభాగాలు, పాతకాలపు ఇంజిన్ డిజైన్ తో చివరికి నష్టాలతో మూతపడే స్థితికి చేరుకున్న బ్రాండ్‌ను ఆయన తన పట్టుదలతో అధునాతన వినూత్న వ్యూహాలతో ఒక గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.
సిద్ధార్థ లాల్ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం అప్పటికే ఉన్న 15 రకాల వ్యాపారాలను వదులుకుని.. కేవలం మోటార్‌సైకిల్స్, ట్రక్కుల మీద మాత్రమే దృష్టి పెట్టడం. రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం ఒక వాహనం కాదని.. అది ఒక జీవనశైలి (లైఫ్ స్టైల్) అని ఆయన గుర్తించారు. బైక్ ఇంజిన్‌ను ఆధునికీకరిస్తూనే దాని ప్రత్యేకమైన `థంప్` శబ్దాన్ని .. రెట్రో లుక్‌ను కాపాడటం ద్వారా పాత తరం-కొత్త తరం కస్టమర్లను ఆకట్టుకున్నారు. ఈ వ్యూహం కంపెనీని నష్టాల నుండి బయటపడేయడమే కాకుండా.. మిడ్-సైజ్ బైక్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా నిలబెట్టింది.
క్లాసిక్ 350 ... బుల్లెట్ మోడల్స్ భారీ విజయాన్ని సాధించడంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రయాణం సరికొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు కేవలం భారతదేశానికే పరిమితమైన ఈ బ్రాండ్... నేడు 60కి పైగా దేశాల్లో తన ఉనికిని చాటుకుంటోంది. హిమాలయన్ , ఇంటర్‌సెప్టర్ 650 వంటి మోడల్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో హార్లే-డేవిడ్సన్, ట్రయంఫ్ వంటి దిగ్గజ బ్రాండ్‌లకు గట్టి పోటీని ఇచ్చింది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించడమే ఈ విజయం వెనుక ఉన్న రహస్యం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ విజయం వెనుక కేవలం ఇంజనీరింగ్ మాత్రమే కాదు.. ఒక బలమైన కమ్యూనిటీ నిర్మాణం కూడా ఉంది. రైడర్ మేనియా వంటి ఈవెంట్ల ద్వారా బైక్ రైడర్ల మధ్య ఒక భావోద్వేగ బంధాన్ని కంపెనీ ఏర్పరిచింది. బైక్‌లను కేవలం ట్రాన్స్‌పోర్ట్ కోసమే కాకుండా.. లాంగ్ ట్రిప్స్ .. అడ్వెంచర్స్ కోసం వాడేలా కస్టమర్ల ఆలోచనా విధానాన్ని మార్చడంలో సిద్ధార్థ లాల్ విజయం సాధించారు. నేడు రాయల్ ఎన్‌ఫీల్డ్ లాభదాయకత , మార్కెట్ విలువ పరంగా ఇతర గ్లోబల్ బ్రాండ్‌లను ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గ్రేట్ కంబ్యాక్ స్టోరీ నేటి వ్యాపారవేత్తలకు ఒక గొప్ప పాఠం. సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు వ్యాపారాన్ని వదులుకోకుండా.. దానిలోని బలాలను గుర్తించి ఆధునికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో సిద్ధార్థ లాల్ నిరూపించారు. ఒక సాధారణ బుల్లెట్ నుండి ప్రపంచం మెచ్చిన సూపర్ బైక్ కంపెనీగా ఎదిగిన ఈ ప్రయాణం.. ఇండియన్ ఆటోమొబైల్ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోతుంది.