జపాన్‌లో ఇండియన్స్‌కు గౌరవం లేదా?
ప్రపంచంలోనే అత్యంత మర్యాదపూర్వకమైన నాగరికత గల దేశంగా జపాన్‌కు మంచి పేరుంది.
ప్రపంచంలోనే అత్యంత మర్యాదపూర్వకమైన నాగరికత గల దేశంగా జపాన్‌కు మంచి పేరుంది. అలాంటి జపాన్‌లో భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నారా? అనే సరికొత్త చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ యూట్యూబర్ సిద్ధార్థ్ భిమాని తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ వీడియో నెటిజన్ల మధ్య పెద్ద వాదోపవాదాలకే దారితీసింది. అసలు జపాన్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
వ్లాగర్ వేసిన ప్రశ్న:
యూట్యూబర్ సిద్ధార్థ్ భిమాని జపాన్‌లోని కొన్ని షాపులకు వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది ప్రవర్తన తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. ఇక మిగిలిన దేశాల కస్టమర్లతో చాలా మర్యాదగా, శ్రద్ధగా మాట్లాడుతున్న స్టోర్ స్టాఫ్.. ఇండియన్స్‌ని చూసేసరికి అంతగా ఆదరించడం లేదని, కనీస ఫ్రెండ్లీనెస్ చూపించలేదని ఆయన ఆరోపించారు. కేవలం నేషనాలిటీ ఆధారంగానే తమకు ఇలాంటి ట్రీట్‌మెంట్ ఎదురైందా? అనే సందేహాన్ని ఆయన లేవనెత్తారు.
నెట్టింట మొదలైన పెద్ద చర్చ:
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సిద్ధార్థ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, తాము కూడా జపాన్ వెళ్లినప్పుడు ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్నామని కామెంట్స్ పెట్టారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం సిద్ధార్థ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఇక జపాన్ టూరిస్టులకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తుందని, ఇది కేవలం ఆయనకు జరిగిన ఒకటో రెండో వ్యక్తిగత సంఘటనలు మాత్రమే కావచ్చు కానీ, మొత్తం దేశాన్ని అనడం కరెక్ట్ కాదని వాదించారు.
భాషా సమస్య కూడా కావచ్చు:
జపాన్ వెళ్లొచ్చిన చాలా మంది భారతీయులు ఆ దేశానికి మద్దతుగా నిలిచారు. "నేను ఏడాది క్రితమే అక్కడికి వెళ్లాను, జపాన్ లో ప్రతి ఒక్కరూ గౌరవం ఇచ్చారు" అని ఒకరు కామెంట్ చేయగా.. "బాయ్! అసలు నువ్వు అక్కడ షాపింగ్ ఎందుకు చేశావు? విండో షాపింగ్ చేసి ఉంటే నవ్వు పేస్ తో పలికేవాళ్లు" అంటూ మరికొందరు సరదాగా కౌంటర్లు వేశారు. ఇక జపాన్‌లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్లు తక్కువ కాబట్టి, అక్కడ ఉండే భాషా సమస్య మరియు వారి సంస్కృతిని కొందరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారని మరికొందరు విశ్లేషించారు.
ఎవరో ఒకరు ఇద్దరు అలా సరిగ్గా ప్రవర్తించనంత మాత్రాన దేశం మొత్తం ఇండియన్స్ ను గౌరవించడం లేదు అనుకోవడం పొరపాటే అవుతుంది. ఇక ఎవరికైనా విదేశాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు టెన్షన్ పడటం సహజం. అయితే, సిద్ధార్థ్ భిమాని అనుభవాన్ని పూర్తిగా కొట్టిపారేయలేకపోయినా, జపాన్ ఆతిథ్య మర్యాదలకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదని మెజారిటీ నెటిజన్ల కామెంట్స్ బట్టి అర్థమవుతోంది.