రైల్వే ట్రాక్.. శ్రీశైలం.. భార్యను అందుకే చంపాడు.. ఇంకా పరారీలోనే నిందితుడు రాజ్‌కుమార్.. ఎక్కడున్నాడు..?

షాబాద్ పోక్సో కేసుతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

Update: 2026-07-13 06:55 GMT

షాబాద్ పోక్సో కేసుతో పాటు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం తెలంగాణ పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం రాజ్‌కుమార్‌ను స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలను పోలీసులు తీవ్రంగా ఖండించారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని.. అతడిని పట్టుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14 ప్రత్యేక బృందాలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయని స్పష్టం చేశారు.

శ్రీశైలం హైవేపై నిఘా.. రైల్వే ట్రాక్ వద్ద దృశ్యాలు

దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు బెంగళూరు, శ్రీశైలం హైవేల వెంట ఉన్న హోటళ్లు, లాడ్జిలు, అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. గతంలో రాజ్‌కుమార్ కొంతకాలం పాటు శ్రీశైలంలో తలదాచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేక బృందాలు గాలింపు జరిపినా.. ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు.

మరోవైపు ఈ కేసులో ఒక కీలకమైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆరుగురిని పొట్టనబెట్టుకున్న తర్వాత రాజ్‌కుమార్ తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు వచ్చే వరకు ట్రాక్‌పైనే నిలబడ్డాడు. కానీ చివరి క్షణంలో మనసు మార్చుకుని అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలను పోలీసులు అత్యంత కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు.

16 సిమ్ కార్డులు.. పోలీసులకే సవాల్‌గా మారిన సాంకేతికత

పోలీసులకు దొరక్కుండా తప్పించుకునేందుకు రాజ్‌కుమార్ ముందస్తు ప్రణాళికతో వ్యవహరించినట్లు విచారణలో తేలింది. టెక్నాలజీ ఆధారంగా పోలీసులు తనను పట్టుకోకుండా ఉండేందుకు అతడు ఏకంగా 4 సెల్‌ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. హత్యలు చేసిన వెంటనే ఆ ఫోన్లన్నింటినీ స్విచ్ ఆఫ్ చేసి, తన లొకేషన్ దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. ప్రస్తుతం పోలీసులు అతడి పాత కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు.

ఆరు హత్యల వెనుక అసలు కథ ఇదే..

ఈ ఘోర కలియుగానికి దారితీసిన కుటుంబ వివాదాల వివరాలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో తనకు ట్యూషన్ చెప్పిన.. తనకంటే పెద్దదైన సరితను రాజ్‌కుమార్ ప్రేమ పేరుతో వేధించాడు. ఆపై 2018లో ఆమెను వివాహం చేసుకున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తూనే బెట్టింగ్‌లు, జూదం, మద్యానికి బానిసయ్యాడు. రూ. 2 కోట్ల వరకు అప్పులు చేసి, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తల్లిదండ్రులు పొలం అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు.

రోజురోజుకూ రాజ్‌కుమార్ వేధింపులు మితిమీరడంతో భరించలేక సరిత విడాకులకు దరఖాస్తు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్.. సరితతో పాటు ఇద్దరు చిన్నారులను కడతేర్చాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకే కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని కూడా కిరాతకంగా చంపేయడంతో ఇది మొత్తం ఆరుగురి హత్యల కేసుగా మారి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

పోలీసుల ప్రకటన

‘‘నిందితుడి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులందరినీ విచారిస్తున్నాం. ప్రతి చిన్న సమాచారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నిందితుడు రాజ్‌కుమార్‌ను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతాం’’ అని పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సైకో కిల్లర్ వేట ఎప్పుడు ముగుస్తుంది? 14 ప్రత్యేక బృందాల శ్రమ ఎప్పుడు ఫలిస్తుంది? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News