'నేను యుద్ధం చేస్తుంటే.. మీరు అవమానిస్తారా?' గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్ర వ్యాఖ్యలు
పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఎవరి పడితే ఎవరికి కాంట్రాక్టులు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రశ్నిస్తున్నారు.
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థికి మేలు చేసేలా పార్టీలో కొందరు వ్యవహరిస్తున్నారని బహిరంగంగా మండిపడ్డారు. బుద్ధవరం పీఏసీఎస్ సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ యార్లగడ్డ గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రత్యర్థులకు మేలు చేసేలా విమానాశ్రయం కాంట్రాక్టు మొత్తం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను యుద్ధం చేస్తూ అవమానాలు పొందితే మీరు ప్రత్యర్థులకు సాయం చేస్తారా? ప్రతివారు పార్టీ అంటే నమ్మేస్తారా? అంటూ సూటి ప్రశ్నలు వేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎట్టి పరిస్థితుల్లో ఊపేక్షించనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బహిరంగ సభలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఓడించిన యార్లగడ్డకు టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యేకు స్థానిక కేడర్ తో పొసగడం లేదని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో ఓ వర్గం ప్రోత్సహించడాన్ని జీర్ణించుకోలేకే ఎమ్మెల్యే యార్లగడ్డ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటే ఎవరి పడితే ఎవరికి కాంట్రాక్టులు ఎలా ఇస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రశ్నిస్తున్నారు. విమానాశ్రయం టెర్మినల్ ను ఉత్తరాదికి చెందిన కాంట్రాక్టర్ రూ.300 కోట్లతో 80 శాతం పనులు చేశారని, నష్టపోయాననే కారణంగా ఆ కాంట్రాక్టర్ మధ్యలో పని వదిలేస్తే రూ.130 కోట్ల పనులు మిగిలిపోయాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వివరించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు కొందరు టీడీపీ నేతలు తన రాజకీయ ప్రత్యర్థికి రూ.200 కోట్లకు పనులు ఇచ్చేలా చేశారని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. బహిరంగ సభలో సహచర టీడీపీ నేతలు సమక్షంలోనే యార్లగడ్డ ఈ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ప్రతివాడు నేను పార్టీ నేను పార్టీ అంటూ వస్తున్నారని, ఆ రోజు పార్టీ కాదని చెప్పిన వారు ఇప్పుడు పార్టీ వారు ఎలా అవుతారని ఎమ్మెల్యే నిలదీశారు. ఇక ఎమ్మెల్యే వ్యాఖ్యలను పరిశీలించిన వారు ఆయన ఆగ్రహానికి కారణం ఎవరై ఉంటారా? అని ఆరా తీస్తున్నారు. పార్టీలో కొందరు నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. తనను కాదని తన ప్రత్యర్థులకు పనిచేసి పెట్టడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు గుప్పించారని చెబుతున్నారు. ఇక ఈ విషయమై పార్టీ అధిష్టానానికి తన నిరసన తెలియజేసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.