తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్... బెట్టింగ్ సైట్లు దర్శనమిస్తున్నాయి!
అవును... తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ క్రమంలో... సైట్ లోని ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుంటే.. ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది.;
సైబర్ నేరగాళ్ల పనులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది! ఆయా రాజకీయ పార్టీలు, సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి, రకరకాల పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ నూ వదలలేదు! ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ గురైందనే విషయం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అవును... తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ క్రమంలో... సైట్ లోని ఆర్డర్ కాపీలు డౌన్ లోడ్ చేస్తుంటే.. ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో... పీడీఎఫ్ ఫైల్స్ కు బదులు బెట్టింగ్ సైట్ ఓపెన్ అవుతోంది. దీంతో... ఈ వ్యవహారం గురించి హైకోర్టు (ఐటీ) రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు.. వెంటనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు.
హైకోర్టు అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన పీడీఎఫ్ డాక్యుమెంట్స్ విషయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి జోక్యం చేసుకున్నట్లు గమనించి, వాటిని డిస్ ప్లే చేయకుండా నిలిపివేసారని.. ఆ డాక్యుమెంట్స్ పై క్లిక్ చేస్తుంటే.. ఆ పేజీలకు బదులు "బీడీజీ స్లాట్" అనే గేమింగ్ సైట్ కు రీడైరెక్ట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు!
ఈ నేపథ్యంలో సంబంధిత ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసిన, చర్యలు తీసుకునేలా దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని వెంకటేశ్వరావు డీజీపీని కోరారు! దీంతో.. సైబర్ క్రైమ్ పోలీసులు.. సెక్షన్ 66 రెడ్ విత్ 43, 66 (సి), 66 (డి) ఐటీ యాక్ట్ తో పాటు బీ.ఎన్.ఎస్. సెక్షన్ 337, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3(1)(ఐ) కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కాగా... తెలంగాణ హైకోర్టు తన అధికారిక వెబ్ సైట్ ను హైదరాబాద్ లోని బీ.ఆర్.కే.ఆర్. భవన్ లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వర్ లలో నిర్వహిస్తుంది. ఈ క్రమంలో... కాజ్ లిస్ట్ లు, కేసు పరిస్థితి, అడ్మినిస్ట్రేటివ్ నోటీసులు, నోటిఫికేషన్ లు వంటి న్యాయపరమైన సమాచారాన్ని ఆన్ లైన్ లో అందిస్తుంది. వీటిలో ఎక్కువ భాగం పీడీఎఫ్ ఫార్మాట్ లోనే ఉంటాయి.