#ViralNews - మొదటి పెళ్లాం ఇంట్లో పెడితే.. రెండో పెళ్లాం బయట తినిపిస్తుందా? హోటల్ బోర్డుపై నెటిజన్ల ‘రచ్చ’

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న రెండు షాపుల బోర్డులు చూస్తే.. “బాబోయ్.. మార్కెటింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నారా? లేక కస్టమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారా?” అనిపించక మానదు.

Update: 2026-06-03 05:43 GMT

వ్యాపారం చేయాలంటే ఒకప్పుడు ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేవాళ్లు. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ‘బోర్డు వింతగా ఉంటేనే.. బిజినెస్ క్లిక్ అవుతుంది’ అని మార్కెటింగ్ సూత్రాన్ని మార్చేశారు మన మేధావులు. కస్టమర్ల నాలుక రుచి సంగతి పక్కన పెడితే ముందు వాళ్ల కంటికి నచ్చేలా బుర్ర తిరిగిపోయేలా పేర్లు పెట్టడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న రెండు షాపుల బోర్డులు చూస్తే.. “బాబోయ్.. మార్కెటింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నారా? లేక కస్టమర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారా?” అనిపించక మానదు.

విశాఖలో ‘రెండో పెళ్లాం’ రచ్చ.. ఇల్లు గడవడమే కష్టమైతే హోటలా?

విశాఖపట్నంలోని మర్రిపాలెంలో ఓ సరికొత్త రెస్టారెంట్ వెలిసింది. బోర్డు మీద పెద్ద అక్షరాలతో ‘రెండో పెళ్లాం’ అని రాసి పడేశారు. ఈ పేరు చూడగానే వైజాగ్ కుర్రాళ్లకు పూనకాలు వచ్చేస్తున్నాయి. పెళ్లయిన మొగుళ్లకైతే గుండె గుభేల్ మంటోంది. అసలే ఒక పెళ్లాన్ని మేపడమే గగనమైపోతుంటే.. ఈ ‘రెండో పెళ్లాం’ ఏంటి సామీ అంటూ జనాలు నోరెళ్లబెడుతున్నారు.

నెటిజన్ల మీమ్స్.. నవ్వుల పువ్వులు!

ఈ బోర్డు ఫోటో సోషల్ మీడియాలోకి ఎక్కడం ఆలస్యం.. మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. “మొదటి పెళ్లాం ఇంట్లో వండి పెడుతుంది కాబట్టి.. రెండో పెళ్లాం బయట తినిపిస్తుంది.. పేరు పర్ఫెక్ట్ భయ్యా!” అని కొందరు లాజిక్కులు తీస్తున్నారు. “ఈ హోటల్‌కు ఫ్యామిలీతో వెళ్తే.. ఇంటికొచ్చాక మొదటి పెళ్లాం చేతిలో పచ్చడవ్వడం ఖాయం” అని మరికొందరు భయపడుతున్నారు. “అయినా ఈ పేరు పెట్టడానికి ఓనర్‌కు ఇంట్లో పర్మిషన్ ఎలా దొరికింది చెప్మా? అన్నయ్య బ్రతికే ఉన్నాడా?” అంటూ ఆరా తీస్తున్నారు. ఏదేమైనా టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ ప్రచారం మాత్రం ‘పీక్స్’ లో వచ్చేసింది!

‘ది క్యాన్సర్ హబ్’.. ఇంతకంటే నిజాయితీ హరిశ్చంద్రుడిలో కూడా ఉండదేమో!

ఇక రెండో షాక్.. ఒక పాన్ షాప్ యజమాని ఇచ్చిన ‘ట్రూత్ బాంబ్’. సాధారణంగా ఏ వ్యాపారి అయినా తన వస్తువుల గొప్పల గురించి చెబుతాడు. కానీ ఈ ఊరు పేరు తెలియని మహానుభావుడు మాత్రం తాను అమ్మే సిగరెట్లు, గుట్కాలు, పొగాకు వల్ల ఏం జరుగుతుందో డైరెక్ట్‌గా బోర్డు మీదే రాసేశాడు ‘ది క్యాన్సర్ హబ్’ . “ఇదే నిజం బాస్! నచ్చితే రండి.. లేదంటే ప్రాణాలు కాపాడుకోండి!” అన్నంత రేంజ్‌లో ఆ బోర్డు నెటిజన్ల మనసులను దోచేస్తోంది.

ప్రభుత్వం చేయలేని పని.. ఈ బోర్డు చేస్తోంది!

సిగరెట్ ప్యాకెట్ల మీద ముసలివాడి బొమ్మలు, భయంకరమైన ఫోటోలు వేసినా అస్సలు తగ్గని మన మందుబాబులు, ఈ బోర్డు చూసి మాత్రం ఒక్క నిమిషం థింకింగ్‌లో పడుతున్నారు. “క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా ఎంత పబ్లిసిటీగా బోర్డు పెట్టావయ్యా.. నీ నిజాయితీకి ఒక దండం” అంటూ దీనికి ప్రశంసలు కురుస్తున్నాయి. నిజంగానే సిగరెట్ ప్యాకెట్ హెచ్చరికల కంటే ఈ బోర్డే ఎక్కువ ‘ఎఫెక్ట్’ ఇస్తోంది!

ఒకప్పుడు వ్యాపారం అంటే నాణ్యత, నమ్మకం. ఇప్పుడు వ్యాపారం అంటే ‘వైరల్ మెటీరియల్’. పేరు వింతగా ఉండి, సోషల్ మీడియాలో ఒక్కసారి మీమ్స్ ట్రెండ్ అయితే చాలు.. కస్టమర్లు క్యూ కట్టేస్తున్నారు. ఏదేమైనా మన ‘రెండో పెళ్లాం’ హోటల్ యజమానికి, ‘క్యాన్సర్ హబ్’ పాన్ షాప్ బాస్‌కు డిజిటల్ మార్కెటింగ్ అవార్డులు ఇచ్చేయొచ్చు. మరి మీరేమంటారు బాస్? ఈ వీకెండ్ ‘రెండో పెళ్లాం’ దగ్గరికి డిన్నర్‌కి వెళ్తున్నారా ఏంటి? కానీ ఇంట్లో చెప్పి వెళ్లండి సుమా...

Tags:    

Similar News