ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైపస్ వ్యాధి...

స్క్రబ్ టైపస్...ఈ పదం ఇపుడు ఆంధ్ర ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కొత్తరకం వ్యాధి ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాకిపోయింది.;

Update: 2025-11-29 05:26 GMT

స్క్రబ్ టైపస్...ఈ పదం ఇపుడు ఆంధ్ర ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ కొత్తరకం వ్యాధి ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పాకిపోయింది. పాజిటివ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా వెలుగు చూస్తున్నాయి. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి బారిన పడక తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ స్క్రబ్ టైపస్ వ్యాధి ఏంటి? అది ఎలా వ్యాపిస్తుంది? దాని లక్షణాలేవి? ఇవే ప్రజల్లో ముసురుకుంటున్న సందేహాలు.

స్క్రబ్ టైపస్ కంటికి కనిపించనంత చిన్న కీటకం. సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ చిన్ని పురుగు కుట్టిన వెంటనే శరీరంపై నల్లమచ్చలు కనిపిస్తాయి. ఆ తర్వాత దుద్దుర్లు వస్తాయి. క్రమంగా జ్వరం, వణుకు, తలనొప్పి , కండరాల నొప్పులు ప్రారంభమవుతాయి. డైజెషన్ సమస్యలతోపాటు ఇన్ ఫెక్షన్, అప్పటికీ గుర్తించక పోతే శ్వాససంబంధిత సమస్యలు చుట్టుముడుతాయి. క్రమంగా ఈ ఇన్ ఫెక్షన్ మెదడు, వెన్నెముక, కిడ్నీలకు వ్యాపించి శరీరంలో వైటల్ ఆర్గాన్స్ విఫలమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే స్క్రబ్ టైపస్ గురించి మరీ గాబరా పడాల్సిన అవసరంలేదు. సకాలంలో గుర్తించి వైద్యుల్ని సంప్రదించడమే ప్రధానమని గుర్తుంచుకోవాలి. సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు చాలా తక్కువగా 2శాతం లోపే ఉంటుంది. కానీ వ్యాధి ముదురుతున్న కొద్దీ ఆ రేటు పెరిగే అవకాశముంది. పేషెంట్ కోమాలోకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ప్రధానంగా గుర్తించాల్సింది ఇది మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు తక్కువ.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ వ్యాధి కనిపిస్తున్నా...చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 379 కేసులున్నట్లు తెలుస్తోంది. కాకినాడ 141, విశాఖ 123, వైఎస్సార్ కడప 94, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 86,అనంతపురం 68, తిరుపతి 64, విజయనగరం 59, అనకాపల్లి 41, శ్రీకాకుళం 34, గుంటూరు 31, కర్నూలు 42, నంద్యాల 30 కేసులు ఇప్పటిదాకా నమోదైనట్లు తెలుస్తోంది.

స్క్రబ్ టైపస్ సీజనల్ వ్యాధిగా గుర్తించవచ్చు. మనకు వానాకాలం, చలికాలం రాగానే మలేరియా, జ్వరం, దగ్గు తదితర జబ్బులు సోకినట్లే...ఈ వైరల్ వ్యాధికూడా సంక్రమిస్తుంది. సాధారణంగా ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా అంటే ఆరునెలల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఈ వ్యాధి నివారణకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. పొలాలు, పశుపాకలు, చెత్తదిబ్బలు, డ్రైనేజీ పూడిక తీత తదితర పనులు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్లు విధిగా వినియోగించాలి. చేతులకు గ్లౌజ్ లు, కాళ్ళకు సాక్స్ లు ధరించడం మరచిపోరాదు. అలాగే ఇంటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దోమలు, క్రిమికీటకాదులు చొరబడకుండా ప్రతి రోజూ ఫినాయల్ తో బండ్లు శుభ్రపరచుకోవాలి. దోమల నివారణకు పొగపెట్టడం, ఆలౌట్, కాయిల్ వాడటం మంచిది. ప్రత్యేకించి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీధుల్లో ఆడుకోడానికి వెళ్ళి రాగానే వారిని కచ్చితంగ కాళ్ళు చేతులు శుభ్రపరచుకునేలా చూడాలి.

ప్రతి సీజన్లోనూ వచ్చే వ్యాధులు గురించి మనకు అవగాహన ఉంటున్నా...కరోనా విలయ తాండవం తర్వాత మనకు ప్రతి జబ్బూ భయాన్ని కలగజేస్తుంటుంది. ఆరోగ్యంపై సగటు మనిషికి అవగాహన బాగా పెరిగింది. ఏ చిన్నజబ్బు వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తుంటారు. కాబట్టి ఈ స్క్రబ్ టైపస్ గురించి పూర్తిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేనేలేదు.

Tags:    

Similar News