సంక్రాంతికి ఊరెళ్తున్నారా? అయితే కష్టమే...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ముఖ్యంగా ఏపీ వాసులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి ఊరెళ్లేందుకు అప్పుడే జాగ్రత్తలు పడుతున్నారు.;

Update: 2025-11-12 10:53 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ముఖ్యంగా ఏపీ వాసులు పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి ఊరెళ్లేందుకు అప్పుడే జాగ్రత్తలు పడుతున్నారు. హైదరాబాద్ తోపాటు ఇతర నగరాల్లో నివసిస్తున్నవారు సంక్రాంతికి సొంతూళ్లు వెళ్లేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే పలు ట్రైన్లు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. రైలు టికెట్లను రెండు నెలలు ముందుగానే రిజర్వు చేసుకునే వెసులుబాటు ఉండటంతో జనవరి 9 నుంచి ప్రయాణాలకు ఇప్పటి నుంచి రిజర్వేషన్లు చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు ఇప్పటికే రిగ్రీట్ అయినట్లు చూపుతున్నాయి. ఈ రైళ్ల టికెట్లు అన్నీ అమ్ముడుపోగా, వెయిటింగ్ లిస్టు కూడా పూర్తయినట్లు చెబుతున్నారు. వెయిటింగు లిస్టు టికెట్ల అమ్మకాన్ని కూడా క్లోజ్ చేయడాన్ని రిగ్రీట్ అంటారు. సహజంగా స్లీపర్, ఏసీ రైళ్ల టికెట్లు అమ్ముడైన తర్వాత 200 నుంచి 300 వరకు వెయిటింగు లిస్టులో టికెట్లు విక్రయిస్తారు. ఇవి కూడా అమ్ముడైన తర్వాత రిగ్రీట్ పెడతారు.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే పలు రైళ్లు రిగ్రీట్ జాబితాలో చూపిస్తున్నారు. జనవరి 9, 10, 11 తేదీల టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. కోణార్క్, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, మహబూబ్ నగర్, జన్మభూమి, ఫలక్ నుమా, ఎల్టీటీ, గరీబ్ రథ్ రైళ్లు టికెట్లు అన్నీ అమ్ముడైపోయాయి. ఈ సారి జనవరి 13, 14, 15 తేదీల్లో సంక్రాంతి పండుగ జరగనుంది. దీంతో హైదరాబాద్ లో స్థిరపడిన వారు పండుగకు ముందుగా సొంతూళ్లు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతానికి ట్రైన్ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు స్పెషల్ ట్రైన్లు వేస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. పండగ సీజన్ లో బస్సు సర్వీసులకు అదనపు చార్జీల బాదుడు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఇతర నగరాల్లో కూడా కోస్తా జిల్లాల వారు లక్షలాదిగా ఉండటం, ఆ మేరకు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో విపరీతమైన డిమాండ్ ఉంటోందని అంటున్నారు.

కాగా, గతంలో ఐఆర్‌సీటీసీ ఖాతా ఉంటే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉండేది. కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్‌ చేస్తూ దుర్వినియోగానికి పాల్పడుతుండడంతో సాధారణ ప్రయాణికులకు తత్కాల్‌ టికెట్లు లభించడం గగనంగా మారేది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్‌ నంబరుతో ఆధార్‌ కార్డు అనుసంధానమై ఉంటేనే తత్కాల్ టికెట్లు బుక్‌ చేసుకునేలా రైల్వే శాఖ నిబంధనలు మార్చింది. అంతేకాకుండా అక్టోబర్‌ 1 నుంచి సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఇదే విధానాన్ని వర్తింపజేసింది. ఆధార్‌ అథంటికేషన్‌ పూర్తైన ఐఆర్‌సీటీసీ ఖాతాలు కలిగిన వారు మాత్రమే ఉదయం 8 గంటలకు రిజర్వేషన్‌ టికెట్లు తీసుకునేలా మార్పు చేసింది. లింక్‌ చేసుకోని వారు 8.15 గంటల తర్వాత మాత్రమే టికెట్లను పొందవచ్చు. దీంతో ట్రైన్ టికెట్ల కోసం ప్రయాణికులు నానా హైరానా పడాల్సివస్తోందని వాపోతున్నారు.

Tags:    

Similar News