ఈ సంక్రాంతిలో ఆసక్తికరంగా ఆన్ లైన్ సందడి ఇదే!
ఇందులో భాగంగా... భోగి సందర్భంగా మంటల్లో వేసే గోపిడకల దండలు.. గతంలో పేడ సేకరించడం, పిడకలు చేయడం, ఎండబెట్టడం, దండ గుచ్చడం వంటి ప్రాసెస్ తో సిద్ధమయ్యేవి.;
సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి.. ఊరూరా భోగి మంటలు దర్శనమిస్తున్నాయి.. పిల్లా, పెద్దా అనే తారతమ్యాలు లేకుండా సందడిలో మునిగిపోతున్నారు. ఇక పిండి వంటల గుభాలింపులు, కొత్త బట్టల మెరుపులు, కొత్త అల్లుళ్ల సందడ్లు అన్నీ ప్రత్యేకమే. ఆ సంగతి అలా ఉంటే.. గతంలో అన్ని ఇంట్లోనే పక్కా ప్లానింగ్ తో చేసుకునే రోజుల నుంచి ఇప్పుడు ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టే పరిస్థితిలు వచ్చేశాయి. తాజాగా ఈ విషయం ఈ సారి సంక్రాంతిలో ఓ హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు.
అవును... గతంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే కనీసం వారం పది రోజుల ముందే పిడకలు చేసి, ఎండబెట్టడం.. వారం రోజులకు ముందే వంటలకు కావాల్సిన పిండి, ముడి సరుకులు సిద్ధం చేసుకోవడం వంటివి సహజంగా జరిగేవి. అయితే ఈసారి ఈ ముందస్తు చర్యల స్థానంలో ఆన్ లైన్ ఆర్డర్స్ వచ్చి చేరాయి. ఈ క్రమంలో చాలా మంది అవకాశాలు లేకో, సమయం దొరక్కో.. అదీగాక కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేద్దామనో తెలియదు కానీ.. సంక్రాంతి వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టారు.
ఇందులో భాగంగా... భోగి సందర్భంగా మంటల్లో వేసే గోపిడకల దండలు.. గతంలో పేడ సేకరించడం, పిడకలు చేయడం, ఎండబెట్టడం, దండ గుచ్చడం వంటి ప్రాసెస్ తో సిద్ధమయ్యేవి. అయితే ఇప్పుడు ఇదంతా చేయకుండానే ఆన్ లైన్ లోనూ పిడకల దండలు దొరుకుతున్నాయి. దీంతో.. ఈఏడాది సంక్రాంతికి చాలామంది ఈ-కామర్స్ సంస్థల్లో అమ్ముతున్న పిడకల దండలను ఆర్డర్లు పెట్టడం విశేషం. అది కూడా గోదావరి జిల్లాల్లో కావడం గమనార్హం!
హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో తమ సొంతూళ్లకు వచ్చిన కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఈ పిడకల దండలను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టారు. ఈ క్రమంలో.. ఆన్ లైన్ లో ఒక్కో దండ రూ.175 నుంచి రూ.250 వరకూ పెట్టి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఆఫ్ లైన్ లోనూ కొన్ని దుకాణాల్లో వీటిని దండల రూపంలో వేలాడదీసి అమ్మకాలు చేశారు. వీటి ధరలు రూ.100 నుంచి రూ.200 వరకు చెబుతున్నారు.
అలా అని ఈ ఆన్ లైన్ ముచ్చట పిడకలకే పరిమితమైందనుకుంటే పొరపాటే సుమా.. పలువురు అరిసెలు, పోకుండలు, జంతికెలు, కజ్జికాయలు వంటి రకరాల పిండి వంటలను ఆన్ లైన్ వేదికగా కొనుగోళ్లు జరిపారు. దీంతో.. ఈ సంక్రాంతిలో ఆన్ లైన్ సందడి గట్టిగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.