ఆపిల్ Vs శాంసంగ్: టెక్ సంస్థల మధ్య సైలెంట్ వార్..కారణం?
నిజానికి 2022లో శాంసంగ్ తొలిసారి ఫోల్డబుల్ ఫోన్ ను గురించి ప్రస్తావిస్తూ.. ఆపిల్ నుంచి ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్ రాలేదంటూ పోస్ట్ పెట్టింది.;
సాధారణంగా ఏ రంగంలో అయినా సరే పోటీ ఉండడం సహజమే.. కానీ ఆ పోటీ ఏ రేంజ్ లో ఉంటుందంటే.. కస్టమర్లను ఆకర్షించుకోవడానికి ఏమైనా చేస్తారు అనేంతలా.. కానీ ఇప్పుడు ఏకంగా రెండు దిగ్గజ టెక్ సంస్థల మధ్య సైలెంట్ వార్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవేవో కాదు తమ ఉత్పత్తులతో.. ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లతోనే కాదు డిజైనింగ్ లో కూడా కస్టమర్లను ఆకట్టుకోవడంలో ముందుండే శాంసంగ్ - ఆపిల్ మధ్య సైలెంట్ వార్ జరగడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లతో.. సరికొత్త మోడల్స్ తో ప్రేక్షకులను అలరించే ఆపిల్ సంస్థ.. ఈసారి కూడా 17 సిరీస్ ఐఫోన్లను లాంచ్ చేసింది. ఆపిల్ పార్కులో నిర్వహించిన ఈ ఈవెంట్లో ఐఫోన్ 17 , ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో , ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఫోన్ లను పరిచయం చేసింది. వీటితోపాటు కొత్తతరం ఎయిర్ పాడ్స్ ప్రో 3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11, ఎస్ఈ 3 వాచ్ ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. అంతా బాగానే ఉన్నా.. ఎప్పటిలాగే ఈసారి కూడా దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ సంస్థ ఆపిల్ ఉత్పత్తులపై పేరు ప్రస్తావించకుండా వ్యంగంగా పోస్టులు పెట్టడంతో టెక్ సంస్థల మధ్య సోషల్ మీడియాలో సైలెంట్ వార్ మొదలైంది అని అటు కస్టమర్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి 2022లో శాంసంగ్ తొలిసారి ఫోల్డబుల్ ఫోన్ ను గురించి ప్రస్తావిస్తూ.. ఆపిల్ నుంచి ఇప్పటివరకు ఫోల్డబుల్ ఫోన్ రాలేదంటూ పోస్ట్ పెట్టింది. దీనికి తోడు ఇప్పుడు ఆ పోస్టును మరొకసారి కోట్ చేస్తూ.. "ఇప్పటికీ రాలేదంటూ" పేరును ప్రస్తావించకుండా ఆపిల్ పై ఇన్ డైరెక్ట్ సెటైర్ వేసింది శాంసంగ్. ఇక్కడితో ఆగకుండా ఆపిల్ సంస్థ తొలిసారి చరిత్రలోనే సన్నని మొబైల్ ని లాంచ్ చేస్తున్నాం అని 17 సిరీస్ లో భాగంగా కామెంట్లు చేయడంతో.. దీనిని కూడా తిప్పి కొట్టే ప్రయత్నం చేసింది శాంసంగ్. ఇంతకంటే తక్కువ సైజులో చాలా మోడల్స్ వచ్చాయి అని అటు శాంసంగ్ తో పాటు పలువురు టెక్ ప్రియులు కూడా కామెంట్లు చేశారు.
అంతేకాదు కెమెరా పని తీరును ఉద్దేశిస్తూ కూడా ఇప్పుడు శాంసంగ్ సెటైర్లు వేసింది.. 48 MP x 3 కూడా 200 మెగాపిక్సల్ కి సమానం కాదు అంటూ మరో పోస్ట్ కూడా పెట్టింది. ఇక ఐఫోన్ 17 సిరీస్ లో ఆపిల్ కొత్తగా పరిచయం చేసిన లైవ్ ట్రాన్స్లేషన్, స్లీప్ స్కోర్ ఫీచర్ లపై కూడా.." దీని కోసం కొంతమంది ఐదేళ్లు వేచి ఉండాల్సి వస్తుందని నమ్మలేకపోతున్నాం" అంటూ వ్యంగంగా వ్యాఖ్యానించడం నిజంగా శత్రుత్వానికి తెరలేపిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఆపిల్ ను ఎగతాళి చేస్తూ #iCant హ్యాష్ ట్యాగ్ తో ఇలా వరుస పోస్టులు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు టెక్ దిగ్గజాల మధ్య వ్యతిరేకతను స్పష్టంగా కనిపించేలా చేస్తున్నాయని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.