యూపీలో ఎస్పీని చీల్చేస్తాం...కాషాయం కఠిన వ్యూహం

ఇండియా కూటమిని విచ్చిన్నం చేయాలీ అంటే అందులో ఉన్న కీలకమైన పార్టీలను దెబ్బ తీయాల్సి ఉంటుంది.

Update: 2026-06-18 03:34 GMT

ఇండియా కూటమిని విచ్చిన్నం చేయాలీ అంటే అందులో ఉన్న కీలకమైన పార్టీలను దెబ్బ తీయాల్సి ఉంటుంది. అలా ఒక్కో పార్టీకీ షాక్ ఇస్తూ పోతే చివరికి ఎన్డీయేకు పోటీ లేకుండా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి కుప్ప కూలుతుంది. ఇది ఒక నయా స్ట్రాటజీ. అంతే కాదు దీని వల్ల మరో లాభం ఉంది. లోక్ సభలో బీజేపీకి అమాంతం ఎంపీలు పెరిగిపోతారు. ఏ బిల్లుని అయినా సులువుగా నెగ్గించుకునే బలం వస్తుంది. రాజ్యాంగ సవరణ బిల్లులు డెడ్ ఈజీగా గ్రీన్ సిగ్నల్ పొందుతాయి. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు.

రెండేళ్ళ ముందే :

నిజానికి బీజేపీ ఈ పని రెండేళ్ళ ముందే చేయాల్సి ఉందని అనుకున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి మ్యాజిక్ నంబర్ దక్కలేదు. 240 సీట్లకే పరిమితం అయింది. ఎన్డీయే మిత్రుల ఆసరాతో అధికారం నిలబెట్టుకున్నా ఒక్కసారి అధికారం దక్కితే చాలు ప్రతిపక్షాలను చీల్చి అయినా బలం సంపాదించడం ఈ దేశంలో రివాజు. అనేక సార్లు గతంలో జరిగింది కూడా. బీజేపీ కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ ఆనాడు ఆ పని చేయలేదు. దాని వెనక పదునైన వ్యూహం ఉంది. ఏంటంటే అప్పుడే చీల్చితే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ మీద జనాలలో వ్యతిరేకత వస్తుంది. పైగా బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది అని ప్రజలలో ఆదరణ లేదని నిందలు పడతాయి. ఇపుడు అలాంటిది లేదు అని అంటున్నారు. వరసగా అనేక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నిలిచి గెలిచింది. దాంతో బీజేపెకి ప్రజాదరణ ఉందని రుజువు అయింది. అదే సమయంలో విపక్షాలకు బలం లేదని జనంలో కూడా ఓటమి దక్కిందని తేటతెల్లమైంది. అందుకే ఇదే అదనుగా బీజేపీ విపక్ష పార్టీలను చీల్చే కార్యక్రమం స్టార్ట్ చేసింది అని అంటున్నారు.

బెంగాల్ తో మొదలెట్టి :

బెంగాల్ లో పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువునా చీల్చే పని సాగుతోంది. ఇరవై మంది దాకా ఎంపీలు అరవై మంది దాకా ఎమ్మెల్యేలు బీజేపీ వైపుగా సాగుతున్నారు. ఇక మహారాష్ట్రలో చూస్తే ఉద్ధవ్ థాక్రేకి చెందిన శివసేన నుంచి ఏడుగురు ఎంపీలు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలను కూడా లాగేసేందుకు బీజేపీ మిత్రపక్షం ఏక్ నాధ్ షిండే నాయకత్వంలోని శివసేన స్కెచ్ గీస్తోంది. ఇవి చాలదు అన్నట్లుగా ఎస్పీ మీద ఇపుడు ఫోకస్ పెడుతున్నారు. ఈ మాటలు పుకార్లు కాదు ప్రచారం అంతకంటే కాదు, ఏకంగా యూపీ మంత్రే దీని మీద సెలవిచ్చారు.

ఎస్పీలో చీలిక అంటూ :

తొందరలోనే యూపీలోని సమాజ్ వాదీ పార్టీలో భారీ చీలిక రాబోతోంది అని యూపీ మంత్రి తాజాగా ప్రకాశ్ రాజ్‌భర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీకి చెందిన ఎంపీలు అంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఆ మంత్రి గారు బాంబు పేల్చారు. ఎస్పీ ఎంపీ అయిన రాం గోపాల్ యాదవ్ ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు అని మంత్రి గారు చెబుతున్నారు. అయితే చీలిక వార్తలను ఎస్ప్తీ తీవ్రంగా ఖండించింది. కానీ దేశంలో తృణమూల్ కాంగ్రెస్ థాక్రే శివసేన చిక్కుల్లో ఉన్న నేపధ్యంలో ఎస్పీ అలెర్ట్ అవుతోంది. ఏమో తమ కొంప మునగవచ్చేమో అని కూడా ఆందోళన చెందుతోంది. ఇక అమ్ముడుపోయే వాళ్ళు ఉంటే కొంటారు అని యూపీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే కనుక దేశంలో మరెన్ని పార్టీలలో చీలిక భయాలను పుట్టిస్తుందో అన్నది అతి పెద్ద చర్చగా ఉంది. వచ్చే ఏడాది యూపీకి ఎన్నికలు ఉన్నాయి. ఇంతలోనే ఎస్పీని బలహీనపరచడం బీజేపీకి అవసరం అందువల్ల యూపీ మంత్రి మాటలను కొట్టిపారేయడానికి అయితే వీలు లేదనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News