ప్రాణాంతకమైన అణు క్షిపణిని ఆవిష్కరించిన రష్యా... పుతిన్ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో టెలివిజన్ సమావేశంలో మాట్లాడిన పుతిన్... ఇటీవలి అణు దళాల విన్యాసాల సమయంలో క్షిపణి 15 గంటలు ప్రయాణించిందని..;
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అవిరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల మాత్రం పుతిన్ తో శిఖరాగ్ర సమావేశ అవకాశాలను తక్కువగా చూపుతూ.. నేను నా సమయాని వృధా చేసుకోవాలనుకోవడం లేదు అని ట్రంప్ అన్నారు.
మరోవైపు.. రష్యాలోని రెండు అతి పెద్ద చమురు కంపెనీలు అయిన రాస్ నెఫ్ట్, లుకాయిల్ లపై ఆంక్షలను విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ఇదే సమయంలో.. రష్యా ఎల్పీజీని ఈయూ దేశాలు దిగుమతి చేసుకోబోవు అని యురోపియన్ యూనియన్ తెలిపింది. ఈ సమయంలో రష్యా నుంచి ఊహించని స్థాయిలో అన్నట్లుగా కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ తో శాంతి చర్చలు వాయిదాల నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం అపరిమిత పరిధి కలిగిన ప్రత్యేకమైన అణుశక్తితో నడిచే 'బ్యూరెవెస్ట్నిక్' క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా... దాని మోహరింపుకు మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు.
ఈ సందర్భంగా... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో టెలివిజన్ సమావేశంలో మాట్లాడిన పుతిన్... ఇటీవలి అణు దళాల విన్యాసాల సమయంలో క్షిపణి 15 గంటలు ప్రయాణించిందని.. ఈ క్రమంలో 14,000 కి.మీ. (8,700 మైళ్లు) ప్రయాణించిందని చెప్పారు. దాని మోహరింపుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సూచించారు.
పుతిన్ ఈ క్షిపణిని "ప్రపంచంలో మరెవరూ కలిగి లేని ప్రత్యేకమైన సృష్టి" అని అభివర్ణించారు. ఈ బ్యూరెవెస్ట్నిక్ "అపరిమిత పరిధి" కలిగి ఉందని అన్నారు. ఇదే సమయంలో... 2018లో రష్యా సైన్యం ఈ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. అమెరికా నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ.. ఇవి అన్ని రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకోగలవని ఆయన అన్నారు.
ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్.. 2021లో ఒక ప్రత్యేక రష్యన్ మిలిటరీ జర్నల్ ను ఉటంకిస్తూ.. బ్యూరెవెస్ట్నిక్ క్షిపణి 20,000 కిమీ (12,400 మైళ్ళు) వరకు రేంజ్ కలిగి ఉంటుందని.. అందువల్ల రష్యాలో ఎక్కడైనా బేస్ చేసుకుని యునైటెడ్ స్టేట్స్ లోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొంది.
ఇదే సమయంలో... యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళానికి చెందిన నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్ 2020 నివేదిక ప్రకారం.. రష్యా బ్యూరెవెస్ట్నిక్ ను విజయవంతంగా సేవలోకి తీసుకువస్తే, అది మాస్కోకు ఖండాంతర-శ్రేణి సామర్థ్యంతో కూడిన ప్రత్యేకమైన ఆయుధాన్ని అందిస్తుంది.