వామ్మో.. గత ఏడాది ఇంతమంది విడాకులు తీసుకున్నారా.. కారణాలు తెలిస్తే గుండె గుబేల్!
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారతదేశంలో విడాకుల కేసులు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.;
ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. భారతదేశంలో విడాకుల కేసులు మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది గణాంకాలు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. పవిత్రమైన బంధంగా భావించే వివాహం, కొద్ది కాలంలోనే కోర్టు గడప తొక్కుతోంది. అసలు దేశవ్యాప్తంగా ఎన్ని లక్షల కేసులు నమోదయ్యాయి? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి? కాపురాలు కూలిపోవడానికి దారితీస్తున్న ఆ షాకింగ్ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
లక్షల్లో విడాకులు.. మన తెలుగు రాష్ట్రం ఎక్కడ ఉందంటే?:
గతేడాది భారతదేశంలో విడాకుల కేసుల సంఖ్య భారీగా నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం 8.27 లక్షల కేసులు ఫైల్ అయ్యాయి అంటే పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మహారాష్ట్ర 18.7 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక 11.7 శాతంతో రెండో స్థానంలో ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే, మన తెలంగాణ 6.7% తో కూడా టాప్-6 రాష్ట్రాల జాబితాలోకి వచ్చేసింది. ఒకప్పుడు విడాకులు అంటే ఏదో పెద్ద నేరంలా చూసే సమాజంలో, ఇప్పుడు నగరాలతో పాటు పట్టణాల్లో కూడా విడిపోయే జంటల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
మూడేళ్ల ముచ్చటేనా?:
విడాకులు తీసుకుంటున్న వారిలో సుమారు 33.2 శాతం మంది పరస్పర అంగీకారంతో 'బై బై' చెప్పుకుంటుంటే, మిగిలిన కేసులు మాత్రం చాలా దారుణమైన కారణాలతో కోర్టుకు వస్తున్నాయి. క్రూరత్వం, గృహహింస మరియు వివాహేతర సంబంధాలు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఇక అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే.. దాదాపు 40 శాతం వివాహాలు పెళ్లయిన మొదటి మూడేళ్లలోనే పెటాకులవుతున్నాయి. ఓపిక తగ్గడం, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం వల్ల పచ్చని కాపురాలు మూడు ముళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.
ఆర్థిక స్వతంత్రత.. మహిళల వైఖరిలో మార్పు:
ఇక ప్రస్తుత రోజుల్లో మహిళల్లో పెరిగిన ఆర్థిక స్వతంత్రత కూడా విడాకుల నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో వేధింపులు ఉన్నా భరించి ఉండేవారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడగలుగుతున్న మహిళలు.. అగౌరవం ఉన్న చోట ఉండలేక విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పురుషాధిక్యత, అత్తమామల వేధింపులు భరించే రోజులు పోయాయని, ఆత్మగౌరవం ముఖ్యమని భావిస్తున్నారు. అయితే, ఈ మార్పు విడాకుల సంఖ్యను పెంచడమే కాకుండా, సమాజంలో కుటుంబ వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది అన్నది నిజం.
మగవారి ధోరణి కూడా మారాల్సిందేనా?
మరొకవైపు మగవారు కూడా ఈగోలకు పోయి ఆడవారిని ఇబ్బందులు పెడుతున్నారనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తలు అంటే పరస్పరం అంగీకారం ఉండాలే కానీ ఈగోలకు పోకూడదని.. పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కాస్త అడుగులు వేస్తే పచ్చని కాపురం నిండు నూరేళ్లు కొంగు బంగారంలా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి అయితే అటు ఆడవారిలో ఇటు మగవారిలో ఆలోచన ధోరణి మారి పరస్పర సహకారంతో ముందడుగు వేయాలని కోరుకుందాం..