సీఎం రేవంత్ సొంతూరు సర్పంచ్ ఎవరంటే...?
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే..! ఇదే మాటను రాజకీయాలకు వర్తింపజేస్తే..! రాష్ట్రానికి సీఎం అయినా ఏదో ఒక ఊరికి చెందినవారే.;
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే..! ఇదే మాటను రాజకీయాలకు వర్తింపజేస్తే..! రాష్ట్రానికి సీఎం అయినా ఏదో ఒక ఊరికి చెందినవారే. దేశంలో కొందరు ముఖ్యమంత్రులు పంచాయతీ స్థాయి నుంచి ఎదిగిన వారున్నారు. ఏది ఏమైనా పల్లె పునాదిగా రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఆశావహులు అందరూ తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆరేళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు రావడం.. బీసీలకు రిజర్వేషన్ల వ్యవహరం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతుండడం.. ఇలా అనేక పరిణామాల మధ్య ఈ ఎన్నికలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ, ఏదో ఒక పార్టీ మద్దతు ఇచ్చిన వారే ఎన్నికల్లో పోటీకి దిగుతుంటారు. ఆ విధంగా చూస్తే చివరకు ఏ పార్టీ మద్దతుదారులు ఎందురు గెలిచారు? అనేది లెక్కలు చూస్తారు.
మరి సీఎం సొంతూరులో ఎవరు?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరిలో సర్పంచ్ గా ఎన్నికయ్యేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. రేవంత్ స్వగ్రామం ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. ఈ గ్రామ జనాభా 3 వేల వరకు ఉంటుంది. మారుమూల గ్రామం అయినప్పటికీ.. రాజకీయ చైతన్యం అధికమే. అలాంటిచోట నుంచి వచ్చినందునే రేవంత్ చురుగ్గా రాజకీయాల్లో పైకి ఎదిగారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొండారెడ్డిపల్లికి కాబోయే సర్పంచ్ ఎవరనే ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లలో భాగంగా ఈ పంచాయతీ ఈసారి ఎస్సీ రిజర్వ్ అయింది. దీంతో పోటీకి నిలిచేది ఎవరనే ప్రశ్న వచ్చింది.
రేవంత్ కుటుంబ అనుచరుడికే..
కొండారెడ్డిపల్లి సర్పంచిగా మల్లెపాకుల వెంకటయ్య (మోహన్)ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వెంకటయ్య గతంలో హోంగార్డుగా పనిచేశారు. మొదటినుంచి రేవంత్ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. వారి అనుచరుడిగా రాజీకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈయనకే సర్పంచి పదవి దక్కేలా ఏకగ్రీవ ప్రయత్నాలు సాగుతున్నాయి. గ్రామస్థులంతా ఈ మేరకు తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ పదవి ఒక్కటే కాదు.. వార్డు సభ్యుల పదవులకు కూడా ఒక్కొక్క నామినేషనే దాఖలయ్యేలా చూసి.. ఏకగ్రీవం చేసి ఆదర్శంగా నిలిచే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.