పదవుల కోసం పైరవీలు చేయలేదు: రేవంత్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని.. పైరవీలు కూడా చేయలేదని చెప్పారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని.. పైరవీలు కూడా చేయలేదని చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి.. వారి మనసు గెలుచుకున్న తర్వాతే.. తనకు పదవులు వరించాయన్నారు. అయితే.. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో అసంతృప్తులపై తరచుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిని నేరుగా పేరు పెట్టి అనకపోయినా.. సూటిగా వారికి తగిలేలా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హైదరాబాద్‌లోని అనంతగిరిలో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు గత మూడు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పదవులు వాటంతట అవే వరిస్తాయని.. తాను ఎక్కడా ఎవరినీ అడగలేదన్నారు. పదవుల కోసం పైరవీలు కూడా చేయలేదన్నారు. జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు ఎదిగినా.. తాను ఎవరినీ ఇది కావాలి.. అని అడగకుండానే అన్ని అందాయని చెప్పుకొచ్చారు.
అదే తారకమంత్రం!
రాహుల్ ప్రధాని కావడమే కాంగ్రెస్‌పార్టీ నాయకులకు తారకమంత్రం కావాలని సీఎంరేవంత్ రెడ్డి సూచించారు. అందరి ముందున్న ఏకైక లక్ష్యం రాహుల్‌గాంధీని దేశ ప్రధానిని చేయడమేనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని పిలుపునిచ్చారు. ``ఈ దేశం కోసం.. ఈ దేశ యువత కోసం.. రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. ఆయన కోసం కాదు. ఇది మనందరి బాధ్యత. ఆదిశగా అందరూ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి`` అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీతోపాటు దేశానికి కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు.
అనవసరంగా వేధించారు!
తనను అనవసరంగా వేధించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో ప్రజాసమస్యలపై గళం విప్పిన తనపై కేసులు నమోదు చేశారని, అయినా.. తాను ఎప్పుడూ వెన్ను చూపలేదన్నారు. జైల్లో పెట్టినా ప్రజల కోసం పనిచేశానన్నారు. ``ఈ 19 ఏళ్లలో జడ్పీటీసీ నుంచి సీఎం అయ్యా`` అని వ్యాఖ్యానించారు. తనపై అనేక కేసులు పెట్టారన్న ఆయన.. ఇవన్నీ తేలిపోతాయన్నారు. సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్న స్పృహ అందరికీ ఉండాలంటూ.. పరోక్షంగా బీఆర్ ఎస్ నాయకులపై వ్యాఖ్యానించారు. కాని.. కొందరు తమ సొంత ప్రయత్నం వల్లే వచ్చిందని చెప్పుకొంటున్నారని అన్నారు. కానీ.. సోనియా ఇవ్వకపోతే తెలంగాణ ఎక్కడిదని ప్రశ్నించారు.