తొలిసారి సీఎం రేవంత్ లో కేసీఆర్ కనిపించారట
కొన్నిసార్లు అనూహ్య రాజకీయ పరిణామాలు చాలా సింఫుల్ గా జరిగిపోతాయి. ఆ మాటకు వస్తే.. మీడియా కూడా అలాంటి సన్నివేశాల్ని మిస్ అవుతూ ఉంటుంది.;
కొన్నిసార్లు అనూహ్య రాజకీయ పరిణామాలు చాలా సింఫుల్ గా జరిగిపోతాయి. ఆ మాటకు వస్తే.. మీడియా కూడా అలాంటి సన్నివేశాల్ని మిస్ అవుతూ ఉంటుంది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రెస్ మీట్ ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. మీడియా భేటీ జరిగిన వేదికను చూస్తే.. బ్యాక్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ ఫోటో.. తెలంగాణ రైజింగ్ వన్ సింబల్ ఒకవైపు.. మరోవైపు తెలంగాణ అధికారిక లోగో మధ్యలో సీఎం రేవంత్ పెద్ద ఫోటో ఉండటం.. దానిముందు కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన కీలక నేతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి.. కోమటిరెడ్డి.. సీతక్కతో పాటు పలువురు నేతలు తోడు ఉండగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్లను చూస్తే.. తనతో పాటు మిగిలిన వారిని కూడా మాట్లాడించే అలవాటు సీఎం రేవంత్ కు ఉండేది. అందుకు భిన్నంగా తాజా ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ మాత్రమే మాట్లాడటం.. మిగిలిన వారంతా మౌనంగా ఉండటమే కాదు.. మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ అంతా తానై అన్నట్లుగా వ్యవహరించారు. ఒక విధంగా వేదిక మీద చాలామంది ఉన్నా.. తిరుగులేని లీడ్ ను రేవంత్ ప్రదర్శించి.. తన అధిక్యతను చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
రేవంత్ సర్కారు ఏర్పడిన రెండున్నరేళ్లకు ఇలాంటి సీన్ తొలిసారి కనిపించిందని చెప్పాలి. రేవంత్ కు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. తొలిసారి.. సీఎం రేవంత్ లో కేసీఆర్ కొట్టొచ్చినట్లుగా కనిపించారని చెప్పాలి. పదేళ్లు సీఎంగా ఉన్న సందర్భంగా కేసీఆర్.. ఏదైనా కీలక ప్రెస్ మీట్ పెడితే.. ఆ మీడియా భేటీలో గులాబీ బాస్ కేసీఆర్ అంతా తానై అన్నట్లుగా వ్యవహరించే వారు. తన మాటే అల్టిమేట్ అన్నట్లుగా ఆయన తీరు ఉండేది.
తాజాగా సీఎం రేవంత్ తీరు ఇంచుమించు అలానే ఉండటం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి.. మాట్లాడే రేవంత్ అందుకు భిన్నంగా ఈసారి తన మీడియా భేటీ మొత్తం కేంద్రంలోని మోడీ సర్కారును.. చట్టసభల్లో సీట్ల పెంపు అంశంపై ఎన్డీయే ప్రభుత్వ విధానాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించటమే కాదు.. తనదైన కొత్త ఫార్ములాను వినిపించటం ద్వారా కొత్త చర్చకు తెర తీశారు. రాజకీయ విమర్శల కంటే కూడా.. చట్టసభల్లో సీట్ల పెంపు అంశంపై కేంద్రం తీసుకొచ్చిన విధానం ఏ మాత్రం బాగోలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ తేల్చి చెప్పినట్లైంది.
సాధారణంగా కేంద్రం తెచ్చే ప్రతిపాదనల్ని వ్యతిరేకించే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే తీరులో వ్యవహరించేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ సైతం అదే విధానాన్ని ఫాలో కావటం గమనార్హం. మొత్తంగా.. మొదటిసారి గులాబీ బాస్ కేసీఆర్ వ్యవహారశైలిని సీఎం రేవంత్ ప్రదర్శించారని చెప్పాలి. అంతేకాదు.. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ తనకున్న పట్టును చెప్పకనే చెప్పేశారు.
అంతేకాదు.. కీలక నేతలను తన చుట్టూ కూర్చోబెట్టుకొని తాను మాత్రమే మాట్లాడటం.. మిగిలిన వారంతా మౌనంగా ఉండటం చూస్తే.. అందరూ తన మాటకు కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ తన చేతలతో చూపించారని చెప్పాలి. కీలక మంత్రులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టటం ద్వారా.. దీనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా సీఎం రేవంత్ జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి. మొత్తంగా తనను తాను స్ట్రాంగ్ లీడర్ అన్న సంకేతాన్ని సరైన సమయంలో ప్రదర్శించిన సీఎం రేవంత్ స్ట్రాటజీ అదిరినట్లుగా చెబుతున్నారు.