ఫ్రీగా ఫ్యాన్స్ షోలు.. దర్శకుడి సూచన

తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్‌ను స్టార్ హీరోలు దోచుకుంటున్నారని రవిబాబు తేల్చేశాడు.;

Update: 2026-05-02 13:30 GMT

అభిమానులను దేవుళ్లుగా అభివర్ణిస్తారు స్టార్ హీరోలు. మీరు లేకుంటే మేము లేము అంటారు. ఈ జీవితం మీకే అంకితం.. మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము అని కూడా చెబుతారు. మరి ఆ అభిమానుల కోసం హీరోలు ఏం చేస్తారు అంటే సమాధానం చెప్పడం కష్టం. పైగా ఈ మధ్య అభిమానుల ప్రేమను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ఎక్కువైపోయాయి. రెగ్యులర్ షోల కంటే ముందుగా ఫ్యాన్స్ కోసం వేసే బెనిఫిట్ షోలు, ప్రిమియర్ షోలకు అధిక రేటు పెడతారు.

పెద్ద సినిమాలను ఈ స్పెషల్ షోల్లో చూడాలంటే వెయ్యి రూపాయల దాకా రేటు పెట్టాల్సి వస్తోంది. అభిమాని పేదవాడు అయినా సరే.. తన హీరో సినిమాను అందరికంటే ముందు చూడాలన్న తాపత్రయంతో సాధార రేటు మీద నాలుగైదు రెట్లు ధర పెట్టి సినిమాను చూస్తున్నాడు. ఇది దోపిడీ కదా అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతుంటుంది. కానీ ఫిలిం సెలబ్రెటీల్లో ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. కానీ ఏ విషయమైనా ఉన్నదున్నట్లు మాట్లాడే రవిబాబు మాత్రం ఈ విషయం మీద కుండబద్దలు కొట్టేశాడు.

తమను ఎంతో అభిమానించే ఫ్యాన్స్‌ను స్టార్ హీరోలు దోచుకుంటున్నారని రవిబాబు తేల్చేశాడు. హీరో మీద అమితమైన ప్రేమ చూపించే ఫ్యాన్స్.. వెయ్యి, అంతకంటే ఎక్కువ రేటు పెట్టి ఆ హీరో సినిమా చూడాల్సి రావడం ఏంటి అని ఆయన ప్రశ్నించాడు. తన ఉద్దేశం ప్రకారం ఫ్యాన్స్ కోసం స్టార్ హీరోలు ఉచితంగా సినిమా చూపించాలని ఆయనన్నాడు. నిజంగా అభిమానుల మీద హీరోలకు ప్రేమ ఉంటే ఇలాగే చేయాలన్నాడు. ఇందుకోసం ఒక పద్ధతి ఉండాలని.. అభిమాన సంఘాల్లో రిజిస్టర్ అయిన వాళ్లు ఐడీ కార్డు చూపిస్తే ఉచితంగా తొలి రోజు సినిమా చూపించేలా ఉండాలన్నాడు. రెండో రోజు నుంచి కావాలంటే రేట్లు పెంచుకోవచ్చన్నాడు.

అంతే తప్ప అభిమానులకు ఎక్కువ రేటు పెట్టి సినిమా చూపించడమేంటని రవిబాబు అన్నాడు. తాను గనుక పెద్ద స్టార్ అయి ఉండి, అంతంతమంది అభిమానులు ఉంటే కచ్చితంగా ఫ్యాన్స్ కోసం ఫ్రీగా సినిమాలు చూపించేవాడినన్నాడు. ఈ ఫిలాసఫీ కరెక్టా కాదా అంటే తాను చెప్పలేనని.. కానీ తన ఉద్దేశం ఇదే అని చెప్పాడు రవిబాబు. మరి మీ సినిమా ‘రేజర్’ను అలా ఫ్రీగా చూపిస్తారా అంటే అది సాధ్యపడదన్నాడు. తాను స్టార్ కాదని, తనకు అభిమానులు లేరని.. తనే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీశా కాబట్టి ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసం టికెట్లు అమ్మే సినిమా చూపించాలన్నాడు రవిబాబు.

Tags:    

Similar News