రాహుల్ పోరాటానికి వైసీపీ మద్దతు ?

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు.;

Update: 2025-08-04 22:30 GMT

కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడా తగ్గడం లేదు. తన మాటల దూకుడు కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఏకంగా 2024 ఎన్నికల మీద గురి పెట్టారు. సవ్యంగా ఎన్నికలు జరగలేదని తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ఓట్ల చోరీ జరిగిందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికల వ్యాప్తంగా ఇలాగే జరిగింది అని తన వద్ద ఆధారాలు ఉన్నాయని కూడా బల్లగుద్దుతున్నారు.

ఈవీఎంల మీద సైతం :

ఈవీఎంల మీద కూడా రాహుల్ గాంధీ గళం విప్పుతున్నారు. ఈసీ సరైన చర్యలు తీసుకోవడం లేదని తన అనుమానాలు అలాగే ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఎక్కడ చూసినా ప్రతీ నియోజకవర్గంలో కొత్త ఓటర్లు వేలలలో చేరుస్తున్నారు అని కూడా ఆయన మండిపడ్డారు. ఇదంతా నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఇక రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థ పనితీరు బాగులేదని బాహాటంగానే అంటున్నారు. ఈ మేరకు ఆయన మీడియా ముఖంగా ఇంటర్వ్యూలను ఇస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీకి నచ్చుతోందా :

ఏపీలో సైతం కూటమి అధికారంలోకి రావడానికి ఈవీఎంల ప్రభావమే అని వైసీపీ నేతలు గతంలో ఆరోపించారు. ఈ రోజుకీ అనుమానాలు వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ఈ సమయంలో వైసీపీకి రాహుల్ గాంధీ మాటలు ఆయన ఈసీ ఈద తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్న వైఖరి నచ్చుతోందా అంటే జవాబు అవును అనే అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే రాహుల్ గాంధీ ఈసీ మీద చేసిన కామెంట్స్ ని ఆయన మీడియాతో అన్న మాటలను ఫార్వర్డ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఈసీ మీద తీవ్ర స్థాయిలో ద్వజమెత్తిన తీరుపై వచ్చిన వార్తా కధనాలను కూడా పోస్టు చేస్తున్నారు.

ఏపీ కూడా ఉన్నట్లేనా :

ఇక రాహుల్ గాంధీ ఈసీ పైన చేస్తున్న ఆరోపణలలో 2023లో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు. అలాగే 2024 చివరిలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలను కూడా హైలెట్ చేస్తున్నారు. బీహార్ లో ఎన్నికల కోసం ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితాను తయారు చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో సైతం ఇదే తీరున సాగిందని ఆయన అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఏపీలో కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగినట్లుగా రాహుల్ చెబుతున్నారని అంటున్నారు. దేశవ్యాప్తంగా 2024లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. వాటితో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. రెండు ఓట్లను ఏపీ ఓటర్లు ఆనాడు వేశారు. అయితే వైసీపీ దారుణంగా పరాజయం పాలు కావడంతో పాటు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కడంతో ఆ పార్టీ నేతలు ఈవీఎంల మీదనే సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.

పోరాటాలు చేయకుండానే :

అయితే దేశంలో చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక సందర్భంలో ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చాయి. వాటిని మీడియా ముఖంగా ధాటీగా చెప్పేందుకు కూడా ఆయా విపక్ష నేతలు వెనకాడలేదు. వైసీపీ మాత్రం ఓటమిని స్వీకరించింది. కారణాలు ఇవీ అని కొందరు వైసీపీ నేతలు చెబుతున్నా అధినాయకత్వం మాత్రం ఈవీఎంల విషయంలో పోరాటానికి పెద్దగా ముందుకు రాలేదన్నది ఉంది. ఇక క్యాడర్ లో అయితే దీని మీద అసంతృప్తి ఉందని అంటున్నారు.

రాహుల్ కు అందుకేనా :

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈసీ మీద ఈవీఎంల మీద ఓట్ల తకరారు మీద చేస్తున్న పోరాటాలకు వైసీపీ సోషల్ మీడియాలో స్పందన ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీకి వైసీపీ మద్దతు అన్నట్లుగా చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే కాంగ్రెస్ వైపు వైసీపీ కన్నెత్తి కూడా చూడదు. వైసీపీ ఎపుడూ దూరాన్ని మెయిన్ టెయిన్ చేస్తూ వస్తోంది. అయితే ఇది కామన్ ఇష్యూగా ఉండడంతోనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు రాహుల్ ఆరోపణల పట్ల ఆయన పోరాటం పట్ల ఎట్రాక్ట్ అవుతున్నారని అంటున్నారు.

నిజానికి చూస్తే దేశంలో ఎన్డీయేకు వ్యతిరేకగా ఇండియా కూటమి పోరాటం చేస్తోంది. ఏపీలో కూడా ఎన్డీయే కూటమి ఉంది. కానీ వైసీపీ మాత్రం కేవలం టీడీపీ జనసేనలకే తన రాజకీయ పోరాటాన్ని పరిమితం చేసింది అన్న విమర్శలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా ఏ కూటమిలో లేకుండా వైసీపీ ఒంటరి పంధాను తీసుకుంది. అయితే కామన్ ఇష్యూల మీద దేశంలో విపక్షాలు చేస్తున్న పోరాటాలు మాత్రం వైసీపీలో దిగువ శ్రేణిలో సోషల్ మీడియా దళానికి నచ్చడంతో అయితే ఆశ్చర్యం లేదనే అంటున్నారు.

Tags:    

Similar News