ఏపీలో థర్డ్ ఫ్రంట్.. పీవీ సునీల్ కుమార్ షాకింగ్ కామెంట్స్ !
ఇక ఈ సామాజిక వర్గాలు అన్నీ కలసి కూటమి కడితే కాపులకు రెండేళ్ళ సీఎం పదవిని ఇస్తూ బీసీలు దళితులు ఆ మిగిలిన కాలాన్ని పంచుకోవాలన్న ప్రతిపాదనలూ ఉన్నాయని అన్నారు.;
ఏపీలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి రెండే కులాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అణగారిన వర్గాలకు చాన్స్ దక్కలేదు అన్న బాధ ఆవేదన వారిలో ఉంది. తాము అత్యధిక శాతం ఓటు షేర్ గా ఉన్నా కూడా రాజ్యాధికారంలో భాగం కాలేకపోతున్నామన్నది కూడా ఉంది. అయితే ఇపుడు అలాంటి వర్గాలు అన్నీ రాజ్యాధికారం ఆశించే వారంతా ఒక చోట చేరబోతున్నారా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అంతే కాదు ఏపీలో ఒక బలమైన థర్డ్ ఫోర్స్ కి బీజం పడుతోందా అన్నది కూడా బిగ్ డిబేట్ గా ఉంది.
సునీల్ ఆలోచనలేంటి :
ప్రస్తుతం ప్రభుత్వం చేత సస్పెండ్ అయి మరో నెలలో రిటైర్ అవుతున్న ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ దళితులకు రాజ్యాధికారం మీద తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన తన ఆలోచనలను ఒక తెలుగు టీవీ చానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రాష్ట్రంలో దళితుల శాతం 16 గా ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే కాపులు అతి పెద్ద జనాభాగా ఉన్నారని అన్నారు ఇక బీసీలు ఇతర అణగారిన వర్గాలు అన్నీ కలుపుకుని ముందుకు సాగితే ఏపీలో కచ్చితంగా కొత్త రాజకీయ శక్తి ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ప్రయత్నాలు అయితే మొదలయ్యాయని ఆయన అంటున్నారు.
అసాధ్యం ఏదీ కాదు :
తెలంగాణా రాష్ట్రం వస్తుందని ఎవరైనా అనుకున్నారా అని సునీల్ కుమార్ ఈ సందర్భంగా ప్రశ్నించడం విశేషం. మరి అది సాకారం అయినపుడు ఏదైనా సాధ్యమే అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఏపీలో రెండు సామాజిక వర్గాలు ఎప్పటికీ కలవవు అనుకున్న కమ్మ కాపులే కలసి అధికారం పంచుకున్నపుడు కాపులు దళితులు బీసీలు అంతా కలసి రాజ్యాధికారం వైపు ఎందుకు అడుగులు వేయకూడదని సునీల్ కుమార్ ప్రశ్నించారు. తమ వైపు నుంచి వచ్చిన ఈ ప్రతిపాదనలు ఇతర సామాజిక వర్గాలలోని ముఖ్యులు కూడా ప్రస్తుతం సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని ఆయన అంటున్నారు. ఈ రోజు కాకపోతే రేపు అయినా ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తుందని సునీల్ కుమార్ అంటున్నారు.
కాపులతో సామరస్యం :
ఈ సందర్భంగా సునీల్ కుమార్ కాపుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దళితులకు కాపులతో ఎలాంటి సమస్య లేదని ఆయన అన్నారు. వారు ఎపుడూ ఒక చుండూరు కానీ కారంచేడు కానీ ఇలాంటి ఘటనలకు పాల్పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు రాజ్యాధికారం కొందరి చేతిలోనే ఉండడం వల్ల మిగిలిన వర్గాలు కేవలం ఓటు వేసే వారిగానే ఉండాల్సి వస్తోంది అని అంటున్నారు. ఈ పరిస్థితి మారాలని తాము గట్టిగా కోరుతున్నామని ఆ దిశగా ప్రయత్నాలు అయితే మొదలయ్యాయని ఆయన అంటున్నారు.
పవర్ షేరింగ్ సైతం :
ఇక ఈ సామాజిక వర్గాలు అన్నీ కలసి కూటమి కడితే కాపులకు రెండేళ్ళ సీఎం పదవిని ఇస్తూ బీసీలు దళితులు ఆ మిగిలిన కాలాన్ని పంచుకోవాలన్న ప్రతిపాదనలూ ఉన్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం సాగుతున్న ఈ చర్చల గురించిన పూర్తి సమాచారాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ దిశగా కార్యాచరణ అయితే స్టార్ట్ అయింది అని మాత్రం సునీల్ కుమార్ చెప్పారు.
రాజకీయ రిజర్వేషన్లు :
ఇక ఆనాడు అంబేద్కర్ ప్రతిపాదించింది ఆర్ధిక రిజర్వేషన్ల కంటే కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే అని ఆయన అన్నారు. రాజ్యాధికారంలో దళితులకు వాటా ఉండాలని అంబేద్కర్ ఎక్కువగా తపన పడ్డారని అన్నారు. ఆర్ధిక రిజర్వేషన్ల వల్ల ఒక స్థాయికి ఎవరైనా ఎదుగుతారని అదే రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లు వస్తే రాజ్యాంగపరమైన అధికారం ఉంటే ఎంతైనా వారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని ఆశాభావాన్ని సునీల్ కుమార్ వ్యక్తం చేశారు. ఇపుడు తమ విధానం కూడా అదే అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి సునీల్ కుమార్ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ తో ఏపీలో థర్డ్ ఫ్రంట్ అన్నది రూపు దిద్దుకోబోతోందా అన్న కొత్త చర్చ అయితే సాగుతోంది.