పుతిన్ వస్తాడు...ఏం ఇస్తాడు?

మరికొన్ని గంటల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ గడ్డపై అడుగుమోపబోతున్నారు. ప్రపంచం మొత్తం ఈ పర్యటనను చాలా ఉత్సుకతతో చూస్తోంది.;

Update: 2025-12-04 12:25 GMT

మరికొన్ని గంటల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ గడ్డపై అడుగుమోపబోతున్నారు. ప్రపంచం మొత్తం ఈ పర్యటనను చాలా ఉత్సుకతతో చూస్తోంది. భారత్ రష్యా సంబంధాలు ఏమేరకు పటిష్టం కానున్నాయో అన్న ఆసక్తి పలు దేశాల్లో కనిపిస్తోంది. ప్రత్యేకించి అమెరికా, చైనా, పాకిస్తాన్ దేశాల్లో ఈ ఆసక్తి మరింత ఎక్కువగానే ఉంటుంది. పుతిన్ భారత్ కు రాగానే కట్టుదిట్టమైన భద్రతా కవచం చుట్టుతా ఉంటుంది. ఈ భారీ భద్రత మధ్య పుతిన్ రెండ్రోజులపాటు భారత్ లో పర్యటిస్తారు. భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం పాతికేళ్ళ పండగ సందర్భంగా పుతిన్ భారత్ కు విచ్చేయనున్నారు. 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాల్లో వారు పాల్గొంటారు.

పుతిన్ వస్తున్నారనగానే మీడియాలో ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య కుదిరే ఒప్పందాలు మొదలు...పుతిన్ ఏం తింటారు...ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు? వారి వెంట టాయిలెట్ కూడా కదలి వస్తోందట ఇలా రకరకాల అంశాలపై వార్తలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటికి మించి ఆపరేషన్ సిందూర్ తర్వాత, రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాక తొలిసారిగా, అమెరికా ఇండియాపై ప్రతీకార ఎగుమతి సుంకాలు విధించిన తర్వాత రష్యాధ్యక్షుడు ఇక్కడికి రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. పరస్పర చర్చలానంతరం ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు, మీడియా ముందు సంయుక్త ప్రకటనలుండే అవకాశాలున్నాయి.

వాణిజ్యం, ఆరోగ్యం, శక్తి, వ్యవసాయం తదితర రంగాల్లో ఒప్పందాలుండవచ్చు. ఎనర్జీ కార్పొరేషన్ డీల్, మాడ్యులర్ రియాక్టర్, చమురు, సెక్యూరిటీ కార్పొరేషన్ ఒప్పందాలుండే చాన్స్ ఉంది. ఉక్రెయిన్ తో యుద్దం తర్వాత రష్యాకు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రష్యా కనీసం 70 వేలమంది భారతీయులను ఈ ఏడాది చివర్లో వివిధ వస్త్ర, నిర్మాణ, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చేర్చుకోనుంది. ఇప్పటికే రష్యా కార్మిక శాఖ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేపట్టింది. ఈ మేరకు ఒప్పందం కుదరనుంది. దీనివల్ల భారతీయులకు రష్యాలో చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఈ పరిణామాన్ని మాస్కోలోని ఇండియన్ బిజినెస్ అలయెన్స్ ఆహ్వానించింది.

ఉక్రెయిన్ తో యుద్ధానికి భారత్ ఆర్థికంగా రష్యాకు దోహదపడుతోందని, చమురు కొనుగోలు ఆపకపోతే ప్రతీకార ఎగుమతి సుంకాలు ఇంకా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిందులు తొక్కినా...భారత్ రష్యాల మధ్య సంబంధం మరింత అర్థవంతంగా పటిష్టంగా మారబోతోంది అనడానికి పుతిన్ భారత్ పర్యటనే ప్రధాన సాక్ష్యం.

Tags:    

Similar News