బీహార్ దంగల్: పటుతర సారథ్యం-ఘనతర నేపథ్యం.. 'పీకే'కు శీల పరీక్ష!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచింది. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీ పోరులో కీలకమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లు తలపడుతున్నాయి.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచింది. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీ పోరులో కీలకమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లు తలపడుతున్నాయి. అయితే..ఈ రెంటికీ నడుమ.. మరోవ్యూహాత్మక కొత్త పార్టీ జన్ సురాజ్ ఆవిర్భవించింది. గత ఏడాది ప్రారంభంలోనే పురుడు పోసుకున్న ఈ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా.. దేశవ్యాప్తంగా పేరున్న ప్రశాంత్ కిశోర్(పీకే) సారథ్యం వహిస్తున్నారు. ఆయన తన పార్టీని ప్రారంభించిన వెంటనే.. అనేక రూపాల్లో ప్రజలకు చేరువ అయ్యారు. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకుంటున్నారు. యువతను కూడా చేరదీస్తున్నారు.
అయితే...ఇప్పుడు 243 స్థానాల్లోనూ ఎవరితోనూ చేతులు కలపకుండా.. ఎవరికీ వంతపాడకుండా.. తానే రంగంలోకి దిగుతాన ని ఆయన చెబుతున్నారు. పటుతర సారథ్యం-ఘనతర నేపథ్యంతో బీహార్ భవితను తీర్చిదిద్దుతానని కూడా ఆయన హామీలు గుప్పిస్తున్నారు. అయితే.. ఇదేమంత తేలికైన విషయమా? అంటే.. కాదనే చెప్పాలి. ఎందుకంటే.. తాను పార్టీ ప్రారంభించిన తర్వాత.. రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికతోపాటు.. పార్లమెంటు ఎన్నికలు కూడా వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉన్న పీకే.. అసెంబ్లీ స్థానాలకు మాత్రం యువతను బరిలోకి దింపారు. కానీ, వారు.. మూడు, నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇద్దరు డిపాజిట్ కూడా కోల్పోయారు.
ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. పీకేకు శీలపరీక్షేనని చెప్పాలి. ఎందుకంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని, 2014లో కేంద్రంలో బీజేపీ సర్కారును, తమిళనాట డీఎంకే సహా కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చానని చెప్పే. ఆయన ఇప్పుడు సొంత గూటిలో సత్తా చాటుకునే పరిస్థితి ఆసన్నమైంది. అంటే.. పార్టీల జాతకాలను చెప్పే.. పీకే.. ఇప్పుడు తన జాతకాన్ని స్వయంగా నిర్దేశించుకునే పరిస్థితికి వచ్చారు. ప్రధానంగా.. కుల సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చే.. బీహార్‌లో యువతను ఆయన చేరదీశారు. తనదైన వాగ్ధాటితో.. సమస్యలు ప్రస్తావించి.. నిరుద్యోగం, ఆత్మగౌరవం, బీహారీల సత్తా.. అంటూ.. మూడు కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ముందుకు సాగుతున్నారు.
ఓటు బ్యాంకు ఎంత?
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి బీహార్‌లో అంతంత మాత్రపు అభిమానమే ఓటర్లు చూపిస్తున్నారు. ఇది.. ఇప్పటి వరకు ఉన్న వాస్తవం. అయితే.. పీకే దీనిని దాటినా.. బలమైన బీజేపీ, ఆర్జేడీల ముందు.. ఆయన చేసే ఎన్నికల విన్యాసం కీలకంగా మారనుంది. మోడీ హవా, ఆర్జేడీ యువ నాయకుడు, మాజీడిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పటిమ.. వంటివి పీకే హవాకు బ్రేకులు వేయడం ఖాయమని అంటున్నారు. అయినప్పటికీ.. `కింగ్ మేకర్` అవతరించే సత్తా ఉంటుందన్న సర్వేల పుణ్యమా అని.. పీకే.. కనుక ఈ దంగల్‌లో ఏమాత్రం పైచేయి సాధించినా.. ఆయన నెగ్గినట్టే. లేకపోతే.. శకునం చెప్పే బల్లి సామెతను గుర్తు చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కొసమెరుపు ఏంటంటే.. జన్ సురాజ్ పార్టీకి పట్టుమని 100 మంది అభ్యర్థులు కూడా లేకపోవడం!.