రాజ్యసభకు పొన్నాల?
సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.;
కాంగ్రెస్లో సీనియర్లకు ప్రాధాన్యత దక్కడం లేదని, బీసీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య రాజ్యసభకు వెళ్లనున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల రాజ్యసభకు ఎలా వెళ్తారనే అనుమానాలు రావడం సహజమే. ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన పొన్నాలను.. రాజ్యసభకు పంపేందుకు కేసీఆర్ ఓకే అన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీసీలో పట్టు ఉన్న నేత, సీనియర్ నాయకుడు కావడం కారణంగా రాజ్యసభకు పంపి పొన్నాలకు సముచిత స్థానం కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిసింది. ఇదే విషయం ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య జనగాం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. వచ్చే ఎన్నికల్లో జనగాం నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపలేదని సమాచారం. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోవడమే మైనస్ అయిందని చెబుతున్నారు. దీంతో తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తూ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ ను వీడారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పొన్నాల సమావేశం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు చివరకు అవమానాలే మిగిలాయని, ఈ ఆవేదనతోనే కాంగ్రెస్ ను వీడుతున్నట్లు టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పొన్నాల రాజీనామా కాంగ్రెస్ కు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పొన్నాలను పార్టీలో చేర్చుకుని లాభపడాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే పొన్నాలకు తగిన గౌరవం ఇచ్చేందుకు పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున జనగామలో ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా అన్నట్లు పోరు జరిగింది. చివరకు కేటీఆర్ జోక్యంతో ముత్తిరెడ్డి తగ్గారు. ఈ నేపథ్యంలో పొన్నాలకు జనగామ టికెట్ ఇవ్వడం కష్టమే. అందుకే రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.