ఆ బంధం ‘విడిపోయింది’.. ఫెవికాల్ యాడ్ పాండే కన్నమూత
‘హచ్..’! ఒకప్పుడు భారత్ లోని ప్రముఖ సెల్ ఫోన్ నెట్ వర్క్... దీని సేవలకు సంబంధించిన అడ్వర్టయిజ్ మెంట్ దేశాన్ని ఊపేసింది.;
‘హచ్..’! ఒకప్పుడు భారత్ లోని ప్రముఖ సెల్ ఫోన్ నెట్ వర్క్... దీని సేవలకు సంబంధించిన అడ్వర్టయిజ్ మెంట్ దేశాన్ని ఊపేసింది. అందులోని కుక్క పిల్ల మరీ ముఖ్యంగా అందరని ఆకట్టుకుంది.. హచ్ తర్వాత వొడాఫోన్ గా మారింది. కానీ, నాటి అడ్వర్టయిజ్ మెంట్ మాత్రం ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
అత్యంత పెలుసుగా ఉండే పగిలిపోయిన కోడిగుడ్డు పెంకును అతికించడం సాధ్యమా..? అయితే, ఆ పని కూడా చేసే జిగురు ఉందని చాటింది ఒక యాడ్...!
జీవితంలో ఏదో ప్రత్యేకత ఉంది... (కుచ్ ఖాస్ హై జిందగీ మే).. నోరూరించేలా కాదు మనసును ఆకట్టుకునేలా రూపొందిన ఇది ఓ చాక్లెట్ కు సంబంధించిన ప్రకటన... !
ప్రతి ఇల్లు ఏదో ఒకటి చెబుతుంది... (హర్ ఘర్ కుచ్ కెహతా హై..) అంటూ ఇంటికి వేసే పెయింట్ గురించి తయారుచేసిన యాడ్ అందరి గుండెల్లో నాటుకుపోయింది.,
ఇవే కాదు.. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన అడ్వర్టయింజ్ మెంట్ల రూపకర్త.. భారత వాణిజ్య ప్రకటన రంగంలో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి పీయూష్ పాండే. తన 70వ ఏట ఆయన శుక్రవారం కన్నుమూశారు.
ఆయనే ఒక బ్రాండ్...
భారత వినియోగదారులతో ఆయనకున్న బంధాన్ని తెంచేసుకున్నారు. పైన చెప్పుకొన్న గుడ్డు యాడ్ ఫెవికాల్ ది కాగా.. కుచ్ ఖాస్ మే జిందగీ ప్రకటన క్యాడ్ బరీ డెయిరీ మిల్క్ చాక్లెట్ ది. హచ్ అడ్వర్టయిజ్ మెంట్ సహా పీయూష్ పాండే ఆధ్వర్యంలో వచ్చిన అడ్వర్టయిజ్ మెంట్లు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆయా ప్రొడక్ట్ లను మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. అసలు వాణిజ్య ప్రకటన అంటే ఇదీ అనేలా ఉండేవి పీయూష్ పాండే రూపొందించిన అడ్వర్టయిజ్ మెంట్స్. హాస్యం, భారతీయ భాషలు, కల్చర్ జోడించడమే పీయూష్ అడ్వర్టయిజ్ మెంట్ల విజయం వెనుక ఉన్న అసలు రహస్యం.
నెల రోజులుగా కోమాలో...
పీయూష్ పాండే కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నెల రోజుల నుంచి కోమాలో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఓగిల్వీ ఇండియాకు చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ (సీసీవో), ఎగ్జిక్యూటివ్ చైర్మన్ (ఈసీ)గా పనిచేశారు. ఆయన మరణాన్ని ఓగిల్వీనే ప్రకటించింది. 43 ఏళ్ల కిందట పీయూష్ ఓగిల్వీ ద్వారానే కమర్షియల్ అడ్వర్టయిజ్ మెంట్ రంగంలోకి వచ్చారు. అప్పటికి భారత మార్కెట్ లో వెస్ట్రన్ అడ్వర్టయిజ్ మెంట్ ప్రభావమే అధికంగా ఉండేది. పీయూష్ రంగప్రవేశంతో అడ్వర్టయిజ్ మెంట్లకు భారతీయత జోడించారు. తన ప్రతికు గాను 2016లో పద్మశ్రీ అవార్డును పొందారు. 2018లో సోదరుడు ప్రసూన్ తో కలిసి కేన్స్ లయన్స్ లో ప్రతిష్ఠాత్మక లయన్ ఆఫ్ సెయింట్ మార్క్ పురస్కారం పొందారు.