వైసీపీలో అమరావతి భయం ఏ స్థాయిలో ఉందో పేర్ని చెప్పినట్లేనా..!
విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014 నుంచి రాజధాని లేని సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుమారు 12 ఏళ్లు అయినా తాత్కాలిక భవనాలతోనే తంతు గడపాల్సిన పరిస్థితులు అనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే!;
విభజిత ఆంధ్రప్రదేశ్ కు 2014 నుంచి రాజధాని లేని సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుమారు 12 ఏళ్లు అయినా తాత్కాలిక భవనాలతోనే తంతు గడపాల్సిన పరిస్థితులు అనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే! అయితే.. 2019లో అమరావతి విషయంలో జగన్ కాస్త పాజిటివ్ గా ఆలోచించి.. తాను ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే వైఖరి నుంచి బయటకు వచ్చి.. గత ప్రభుత్వం మొదలుపెట్టిన పనులను కంటిన్యూ చేసి ఉంటే.. ఈ పాటికి విభజిత ఏపీకి రాజధాని ఉండేదని అంటున్న సంగతీ తెలిసిందే!
2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి విషయంలో వైఎస్ జగన్ అనుసరించిన వైఖరి.. రాజధాని రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు కల్పించింది! దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా.. ఆఖరికి విశాఖ నుంచీ విమర్శలు వినిపించిన స్థితి! అయినప్పటికీ జగన్ తగ్గేదే లే అన్నారు.. దీంతో ఏపీ ప్రజలు గెలిచేదే లే అంటూ గట్టి దెబ్బ కొట్టిన పరిస్థితి! దీంతో.. 2024 తర్వాత అమరావతిపై వైసీపీలోని పలువురు మాజీ మంత్రుల నుంచి సన్నాయినొక్కుల సౌండ్స్ వచ్చాయనే చర్చ జరిగింది!
కాలక్రమేణా అమరావతి విషయంలో ఏపీ ప్రజల ఆలోచనను, రాజధాని రైతుల పరిస్థిని అర్ధం చేసుకుని, ఏపీకి అమరావతే రాజధాని అనే మాటలు వైసీపీ నేతలు నుంచి వినిపించాయి! దీంతో.. అమరావతి విషయంలో జగన్ & కో వైఖరి మారినట్లుగా ఉంది అనే చర్చ జరిగింది. ఈ క్రమంలో.. అమరావతి విషయంలో జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. నదీ తీరాలపై ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాల్సిన అవసరాన్ని ప్రశ్నిస్తూ.. ప్రజాధనాన్ని వృథాచేస్తున్నారని విమర్శించారు!
ఇదే సమయంలో.. విజయవాడ - గుంటూరు రహదారికి సమీపంలో రాజధాని నిర్మాణంపైనా సూచనలు చేశారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి! అమరావతి విషయంలో జగన్ వైఖరి మారలేదనే కామెంట్లు, కథనాలు కనిపించాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వ కేబినెట్ మంత్రులు ఒకరితర్వాత ఒకరు విరుచుకుపడ్డారు.. అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. ఈ సమయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలకు సంబంధించిన నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లున్నారు!
అవును... అమరావతిపై జగన్ వ్యాఖ్యలు.. దానిపై ప్రజల నుంచి వచ్చిన విమర్శలు.. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆగ్రహాల నడుమ వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగారు. జగన్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా... జగన్ వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్ధం చేసుకుంటే.. మరికొంతమంది మరింత తప్పుగా వక్రీకరించి నివేదించారని, బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
నదీ తీరాల దగ్గర రాజధాని నిర్మించడం గురించి మాత్రమే జగన్ ప్రశ్నించారని చెబుతూ... చంద్రబాబు, ఆయన కుటుంబం తమ హెరిటేజ్ కార్యాలయాలను నదీ తీరాల దగ్గర నిర్మిస్తారా అని జగన్ అడిగారని.. ముందుగా వారు దీనికి సమాధానం చెప్పాలని పట్టుబట్టారని నాని అన్నారు. జగన్ వ్యాఖ్యలను నిత్యం వక్రీకరించే పనికే చాలా మంది పూనుకుని పబ్బం గడుపుకుంటున్నారన్నట్లు విమర్శిస్తూ మండిపడ్డారు!
అయితే... ఇక్కడ పేర్ని నాని అయినా, జగన్ అయినా.. ‘మరెవరైనా’ గమనించాల్సిన విషయం ఏమిటంటే... నవ్యాంధ్రలో ప్రస్తుతం మూడో ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పటికే రెండు ప్రభుత్వాల పూర్తి కాలం ముగిసిన స్థితి. అయినప్పటికీ రాష్ట్రానికి రాజధానిలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడో ప్రభుత్వం ఏర్పడిన ఈ టెర్మ్ లో అయినా కూటమి నేతలు వాగ్ధానం చేసినట్లుగా అమరావతి రాజధాని పూర్తవ్వాలని.. అభివృద్ధి కనిపించాలని.. ఉద్యోగాలు సృష్టించబడాలని ఆంధ్రులు బలంగా కోరుకుంటున్నారు.
2024లో వచ్చిన ఫలితాలకు ఈ బలమైన ఆకాంక్ష కూడా కారణమని కచ్చితంగా చెప్పొచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం సక్రమంగా సాగే విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పక్షాలు సహకరించాలని.. సమస్యలు తొలగాలని.. 2029లోపు ఏపీ ప్రజానికం తమకంటూ ఓ బలమైన రాజధాని ఉందని తృప్తి పడాలని అంతా కోరుకుంటున్నారు! ఆ తర్వాత ఫలితాల సంగతంటారా.. పూర్తిగా ప్రజాభిష్టం కదా..!!