ట్రాఫిక్ చలానాలపై కేంద్రం కొత్త రూల్? అందులో ఏముంది?

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధించటం తెలిసిందే. ట్రాఫిక్ నియంత్రణ కంటే చలానాలు వేసే అంశం మీదే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తారన్నది తెలిసిందే;

Update: 2025-10-05 05:56 GMT

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధించటం తెలిసిందే. ట్రాఫిక్ నియంత్రణ కంటే చలానాలు వేసే అంశం మీదే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఫోకస్ చేస్తారన్నది తెలిసిందే. వాహనాల మీద పడే చలానాల్ని పట్టించుకోకుండా, తమకు తోచినట్లుగా వ్యవహరించే వాహనదారులకు దిమ్మతిరిగే షాకిస్తూ కేంద్రం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చేలా కసరత్తు చేస్తోంది. ఇందులో కీలకమైనది ఐదు చలానాల్ని నిర్ణీత కాలవ్యవధిలో క్లియర్ చేయకుంటే వాహనాన్ని స్వాధీనం చేసుకోవటమే కాదు.. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసేలా చర్యలు తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే ఉన్న నిబంధనల్ని మర్చేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ సర్కారు ప్రయత్నం చేస్తోంది. సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్ 1989లోని కొన్ని నిబంధనలకు కీలక సవరణల్ని ప్రతిపాదించింది కేంద్ర రవాణా శాఖ. పాత చట్టంలో చలానాలపై చర్యలకు సంబంధించిన విధివిధానాలు సరిగా లేకపోవటంతో.. ఇప్పుడు కఠిన నిబంధనల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇందులో భాగంగా డ్రాఫ్టు రూల్స్ ఫ్రేమ్ చేసి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో పెండింగ్ చలానాలు.. అలాంటి వారిపై తీసుకోవాల్సిన చర్యల అంశాన్ని ప్రస్తావించారు. నిబంధనల్ని ఉల్లంఘిస్తే వాహనదారుకు సంబంధిత అధికారులు మూడు రోజుల్లోగా ఎలక్ట్రానిక్ రూపంలో నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు..ఫిజికల్ రూపంలో నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఇందుకు పదిహేను రోజులు గడువు విధించటం గమనార్హం. ఈ ముసాయిదాలోని అంశాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. సూచనలు చేయాలన్నా ఢిల్లీలోని రహదారి రవాణా మంత్రిత్వ శాఖలోని అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది.

మోటారు వెహికిల్ యాక్టు ప్రకారం ఒక వాహనంపై ఐదు.. అంతకంటే ఎక్కువ చలానాలు జారీ అయితే డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయొచ్చు. ఇప్పటికే ఉన్న రూల్స్ కంటిన్యూ అవుతాయి. ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం 90 రోజుల్లో చలాన్ కట్టాలి. కొత్త రూల్ చలానా చెల్లింపు గడువు 45 రోజులకు తగ్గించారు. చలానాలు ఆలస్యం చేస్తే.. ఆ వాహనంపై రవాణా శాఖ ఎలాంటి లావాదేవీల్ని ఒప్పుకోదు. దీంతో.. దాన్ని ఎవరికి అమ్మలేరు. లైసెన్సులో అడ్రస్ మార్పుతో పాటు రెన్యువల్ కూడా కుదరదు. చలానా కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ప్రస్తుతం చలానాలు వాహన యజమాని పేరుతో వచ్చేవి. ఇకపై డ్రైవింగ్ చేసే సమయంలో యజమానికి బండి నడపలేదని నిరూపిస్తే.. డ్రైవింగ్ చేసిన వారిపై చలానాలు విధిస్తారు.

Tags:    

Similar News