పవన్...షర్మిల : కాబోయే సీఎంలు ...!
కానీ ఆ అవకాశం అదృష్టం ఎవరికీ దక్కదనే చెప్పాలి. ఉత్తరాదిన చూస్తే వర్తమానంలో కేజ్రీవాల్ కనిపిస్తారు.;
ఏపీలో ఒక వింత రాజకీయం సాగుతోంది. ఎవరు పార్టీ పెట్టినా లేక ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా ఏకంగా సీఎం పదవి మీదకే గురి పెడుతున్నారు. ఇది గతానికి పూర్తిగా విరుద్ధమైన విధానమే. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, బ్రహ్మానందరెడ్డి,నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్సార్ చంద్రబాబు వంటి వారు అంతా ఎమ్మెల్యేలుగా నెగ్గి మంత్రులుగా అయి అధికారంలో ఉంటూ విపక్షంలోనూ ఉంటూ ఆఖరుకు పరమ పద సోపానంగా సీఎం పదవిని అధిష్టించారు.
కానీ 1983లో ఎన్టీయార్ తో ట్రెండ్ మారింది. ఆయన ఎకా ఎకీన సీఎం అయిపోయారు. మంత్రి పదవి చేయలేదు. రాజకీయంగా అనుభవం కూడా లేదు. కానీ ఆ అవకాశం అదృష్టం ఎవరికీ దక్కదనే చెప్పాలి. ఉత్తరాదిన చూస్తే వర్తమానంలో కేజ్రీవాల్ కనిపిస్తారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాలో రేవంత్ రెడ్డి అయినా ఏపీలో జగన్ అయినా మంత్రులు కాకుండానే సీఎం అయిపోయారు కదా అంటే వారు మినిస్టర్స్ అనిపించుకోలేదు కానీ ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. విపక్షంలో ఉంటూ పోరాటాలు చేశారు. ఆ మీదట ముఖ్యమంత్రులు అయ్యారు.
అలా వారి అనుభవం కూడా గొప్పదే అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏపీలో చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీఎం అంటున్నారు. ఆయన 2019లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు చోట్ల చేసినా ఎమ్మెల్యేగా గెలవలేదు. ఆయన గెలిచి అసెంబ్లీలోకి వచ్చి ఉంటే అనుభవం కొంత సంపాదించి ఉండేవారు అన్న మాట ఉంది.
పవన్ పోనీ ఎన్నికల రాజకీయాలైనా చూశారు. పార్టీని సైతం పదేళ్లుగా నడుపుతున్నారు కాబట్టి ఆ విధంగా కొంత అనుభవం ఉంది అనుకోవచ్చు. కానీ వైఎస్ షర్మిల తీరు ఇంకా జోరుగా ఉంది అని అంటున్నారు. ఆమె 2021లో తెలంగాణాలో పార్టీ పెట్టారు. 2024 రాకుండానే మూసేశారు. గట్టిగా రెండేళ్ళు కూడా పార్టీని నడపలేదు. తెలంగాణాలో ఆమె ఒక విఫల రాజకీయ నాయకురాలిగా మిగిలిపోయారు.
మరీ ఆశ్చర్యం ఏంటి అంటే ఆమె తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆమె పోటీ చేసి ఓడినా పోనీ కొంత అనుభవం వచ్చేది. అలాంటి షర్మిలను ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలిగా చేశారు అంటే ఆమెకు ఉన్న అర్హత వైఎస్సార్ తనయగానే అని అంటారు. అంతే కాదు ఏపీ సీఎం జగన్ చెల్లెలుగా ఆమె ఫోకస్ అవుతున్నారు కాబట్టి ఆ పోస్టు ఇచ్చారు.
కాంగ్రెస్ లో రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు చేసిన ఉద్ధండులు ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వారు ఉన్నారు. అయినా సరే ఏపీ కాంగ్రెస్ లో షర్మిలను ముందు పెట్టి రాజకీయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఇక అనంతపురంలో జరిగిన సభలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అయితే ఏపీకి కాబోయే సీఎం షర్మిల అని అదే వేదిక మీద చెప్పేశారు.
ముందే చెప్పుకున్నట్లుగా ఎంతో మంది కాంగ్రెస్ ఉద్ధండ పండితులు ఉండగా షర్మిల కాంగ్రెస్ సీఎం అని పెద్దాయన ఎలా అన్నారో అన్న చర్చకు తెర లేచింది ఈ మాటలు వెరీ స్వీట్ గా ఉంటాయి. సీఎం అనగానే మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. తీరా గుర్రం ఎగిరితే కాంగ్రెస్ పార్టీనే ఏపీలో గెలిస్తే అపుడు రావాల్సిన వారంతా వచ్చి సీఎం పోస్టులో ముందు వరసలో నిలబడతారు.
ఏది ఏమైనా సీఎం అని ప్రకటించడం మంచిదే కానీ సీనియర్లు అనుభవం పండిన వారి నుంచి కూడా ఈ తరహా మాటలు రావడం చిత్రం అని అంటున్నారు. ఏపీ అంటే అయిదు కోట్లకు పై చిలుకు జనాభా కలిగినది. ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న స్టేట్. విభజన తరువాత సమస్యలు వేయింతలు అయ్యాయి. మూడు ప్రాంతాలు ముప్పయి మూడు రకాల వ్యవహారాలు.
అనుభవం పండిన వారు అనే చంద్రబాబును 2014లో సీఎం ని చేశారు. జగన్ ని అలా అయిదేళ్ళు విపక్షంలో ఉంటూ అనుభవం సంపాదించమని జనాలు చెప్పి అలా 2019లో చాన్స్ ఇచ్చారు. ఇపుడు చూస్తే ఏపీ వరకూ బాబు జగన్ ఇద్దరికీ అన్నీ తెలుసు. ఏపీ కష్టనష్టాలు పూర్తిగా తెలుసు. ఆర్ధిక భారాలు ఖజానా కబుర్లూ తెలుసు. ఏపీలో ఏ మూల ఏముందో తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరిని నెగ్గించినా ఏపీని వారి మార్గంలో నడిపించగలరనీ తెలుసు.
మరి పవన్ అయినా షర్మిల అయినా సీఎంలు కావాలన్న కోరిక ఉంటే జనంలో ఇంకా ఉండాలని ఇంకా ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని అంటున్నారు. సీఎం పదవి అన్నది నాయకులు ఎవరూ ఇవ్వరని ప్రజలే ఇస్తారని కూడా గుర్తు చేస్తున్నారు. సీఎం సీఎం అని అంటూంటే మురిసిపోకుండా ప్రజలతో మమేకం అయి పనిచేసిన నాడు వారే అందలం ఎక్కిస్తారు అన్నది జనం మాట.