జనసేన సర్దుకుపోవడమేనా?

రాజకీయాల్లో మార్పు కోసమంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేన పార్టీ సర్దుకుపోతూనే ఉంటుందా?;

Update: 2023-11-06 02:30 GMT

రాజకీయాల్లో మార్పు కోసమంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేన పార్టీ సర్దుకుపోతూనే ఉంటుందా? ఇతర పార్టీల ప్రయోజనాల కోసం పని చేస్తూనే ఉంటుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అనుకున్న దానికంటే తక్కువ సీట్లకే పరిమితం కావడమే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలతో చర్చల తర్వాత తెలంగాణలో కేవలం 9 స్థానాల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, రాజకీయాల్లో చైతన్యం కోసం 2014లో జనసేన పార్టీని పవన్ ప్రారంభించారు. కానీ ఆ ఏడాది ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి పవన్ మద్దతుగా నిలిచారు. కానీ అయిదేళ్లు తిరిగేసరికి ఎన్నో మార్పులు. మధ్యలో నాటకీయ పరిణామాలు. బీజేపీ, టీడీపీకి దూరంగా జరిగారు పవన్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవగలిగింది. దీని తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ తిరిగి బీజేపీతో చేతులు కలిపారు.

ఇప్పుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీతో పొత్తు ప్రకటించారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పోటీ చేసే స్థానాలనూ వెల్లడించింది. కానీ పొత్తులో ఉన్న బీజేపీతో చర్చల తర్వాత కేవలం 9 స్థానాలకే జనసేన పరిమితమవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట, నాగర్ కర్నూల్, కూకట్ పల్లి, తాండూరు, కోదాడ తదితర సీట్లను జనసేనకు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. రాబోయే ఏపీ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీతో పొత్తుతోనే జనసేన పోటీ చేయనుంది. దీంతో జనసేన వైఖరిపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కార్యకర్తలూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా ఎన్నికల సమరంలో దిగి తాడోపేడో తేల్చుకోవాలని కానీ ఇలా ఎన్ని రోజులు సర్దుకుపోతామంటూ పార్టీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయని తెలిసింది.

Tags:    

Similar News