కూటమి పొత్తు బలహీనం చేయొద్దు......పవన్ హాట్ కామెంట్స్ !
ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటు వెనక జనసేన కృషి ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆయన 2022లో ఇప్పటం లో జరిగిన పార్టీ సభలో అంతా కలసి రావాలని కోరారు.;
ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటు వెనక జనసేన కృషి ఉందన్నది అందరికీ తెలిసిందే. ఆయన 2022లో ఇప్పటం లో జరిగిన పార్టీ సభలో అంతా కలసి రావాలని కోరారు. జనతా ప్రయోగాన్ని ఉదహరించారు. అలా ఆయన అనుకున్నది కాస్తా 2023 తరువాత సానుకూలం అయింది. పూర్తి పిక్చర్ రావడానికి 2024 మొదటి దాకా సమయం తీసుకుంది. అటు టీడీపీ ఇటు బీజేపీకి మధ్యన సంధాకర్తగా జనసేన ఉండి పొత్తుని ఏపీలో పొడిచేలా చేసింది. మొత్తానికి అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. పొత్తు బ్రహ్మాండంగా ఏపీలో హిట్ అయింది. ఎన్నడూ రాని సీట్లు కూటమికి దక్కాయి. వైసీపీకి కేవలం 11 సీట్లే లభించాయి. ఇవన్నీ ఇలా ఉంటే పవన్ ఈ మధ్య కాలంలో తరచూ ఒక మాట అంటూ వస్తున్నారు, కూటమి పొత్తులకు విఘాతం కలిగించవద్దు అని. అంతే కాదు ఆయన మరో మాట చెబుతున్నారు. ఏపీలో పదిహేనేళ్ల పాటు కూటమి అధికారంలో కొనసాగాలని. అపార రాజకీయ అనుభవం పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నారు.
బలహీనం చేయవద్దు :
తాజాగా పిఠాపురంలో జరిగిన సంక్రాంతి వేడుకలలో భాగంగా పవన్ కళ్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీల మధ్య పొత్తును బలహీనం చేయవద్దని ఆయన మాట్లాడుతూ అన్నారు. అంతే కాదు ఆ తరహా ప్రయత్నాలు అసలు చేయవద్దు అని అన్నారు. ఎంతో కష్టపడితేనే కూటమి తయారు అయిందని ఆయన చెప్పారు. ఏదైనా కలిపి ఉంచడం కష్టం కానీ విడదీయం తేలిక అని కూడా అన్నారు. ఈ విధంగా పవన్ చేసిన హిత బోధ కానీ లేక సూచనలు కానీ లేదా హెచ్చరికలు కానీ ఎవరిని ఉద్దేశించి అన్నది ఇపుడు చర్చకు వస్తున్న విషయంగా ఉంది.
వైసీపీ అయితే కాదు :
ఎందుకంటే ఏపీలో వైసీపీ విపక్షంలో ఉంది. విపక్ష పార్టీ కర్తవ్యమే అధికార పక్షం వీక్ కావాలని. అలాగే కూటమిలో చిచ్చు రేగాలని, వారంతా విడిపోవాలని. అలా కోరుకోవడంలో వారి పరంగా తప్పు లేదు, అంతే కాదు అది వారి రాజకీయ వ్యూహం గా ఉంటుంది, సో విపక్షానికి అయితే పవన్ ఈ తరహా సూచనలు కానీ హిత బోధలు కానీ చేయలేరు. మరి ఆయన చెప్పినది ఎవరి మీద ఎందుకోసం అన్నదే ఇపుడు చర్చ. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. టీడీపీ పెద్దన్నగా ఉంది. జనసేన రెండో ప్లేస్ లో ఉంది, బీజేపీ జూనియర్ పార్టనర్ గా ఉంది. అయితే ఈ పార్టీల మధ్య పై స్థాయిలో మంచి సఖ్యత అయితే ఉంది. పవన్ చంద్రబాబుల మధ్య అయితే దోస్తీ వేరే లెవెల్ అన్నట్లుగా ఉంది. ఇక కేంద్రంలో బీజేపీకి కూడా ఏపీలో కూటమిని బలోపేతం చేసే విషయంలో రెండవ మాట అన్నది అయితే ఉండదు, మరి ఉన్నత స్థాయిలో వికసించిన ఈ స్నేహం కానీ సయోధ్య కానీ దిగువ స్థాయిలో కనిపించడం లేదా అన్నదే చర్చగా ఉంది.
గ్రౌండ్ లెవెల్ లోనేనా :
కూటమిలో చూస్తే గ్రౌండ్ లెవెల్ లో పార్టీలు వేటికవే ఉంటూ వస్తున్నాయి. రాజకీయంగానే చూసుకుంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎవరి హవా ఏమిటి అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తోంది. అధిక్యత చూపాలని కూడా ఆలోచనలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంతో పవన్ చెబుతున్నది గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ మీదనే అని అంటున్నారు. కూటమిలోని అన్ని పార్టీలు కలసి ఉండాలని ఆయన చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అదే సమయంలో ఇంకా ఎవరైనా ఎమ్మెల్యే స్థాయిలో అయినా కూడా కూటమిలో ఒంటెద్దు పోకడలు పోయినా కూడా పవన్ చేసే సూచనలు హితోక్తులు వారికే వర్తిస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా కూటమిలో అసలైన ఐక్యత గ్రౌండ్ లెవెల్ లో రావాలని అంతా కోరుతున్నారు. అది జరిగితేనే 2024 మాదిరిగా సూపర్ హిట్ రిజల్ట్స్ రిపీట్ అవుతాయని అంటున్నారు ఆ దిశగా పై స్థాయిలో పార్టీల నాయకత్వాలు అయితే విశేష కృషినే చేస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.