రాజకీయాల నుంచి క్విట్...పవన్ భావోద్వేగం

పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాటలు అన్నారు, ఆవేశ పడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్ గా చెప్పుకున్నారా అన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతొంది;

Update: 2025-10-09 17:22 GMT

పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ మాటలు అన్నారు, ఆవేశ పడ్డారా లేక భావోద్వేగం చెందారా లేక తన నిబద్ధత మీద ఎవరూ శంకించవద్దు అని ఒక అప్పీల్ గా చెప్పుకున్నారా అన్నది ఇపుడు చర్చనీయాంశం అవుతొంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ గురువారం ఉప్పాడ లో చేసిన ప్రసంగం ఆద్యంతం అభిమానులను ఉర్రూతలూగించింది. అదే సమయంలో స్థానిక ప్రజలకు మత్స్యకారులకు అభయహస్తం గా మారింది. నేను ఉన్నాను మీకు అన్నీ చేస్తాను చూస్తాను అన్న హామీ అయితే గట్టిగానే పవన్ ఇచ్చారు.

తప్పుకుంటాను అంటూ :

తాను మత్స్యకారుల సమస్యలను పరిష్కరించలేని నాడు రాజకీయాల నుంచి ఏకంగా తప్పుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. మత్య్సకారుల సమస్యల మీద తనకు అవగాహన ఉందని చిత్తశుద్ధి కూడా ఉందని ఆయన చెప్పుకున్నారు ఎవరో వస్తారు, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి నా మీద ఎగదోస్తున్నారు. వారేమీ చేయరు, నేను మాత్రం చేస్తాను ఈ సంగతి గుర్తించండి అని పవన్ విన్నవించుకున్నారు. మీరు తిడితే పడతాను దెబ్బ పడితే భుజం కాస్తాను నేను మీ వాడిని మీతోటి మత్స్యకారుడిని అని పవన్ ఆవేశంగా చెప్పుకొచ్చారు.

వైఎస్ తెచ్చిన పరిశ్రమలు :

ప్రస్తుతం అక్కడ ఉన్న పరిశ్రమలు కానీ సెజ్ లు కానీ అన్నీ వైఎస్సార్ హయాంలో 2005లో వచ్చినవి అని పవన్ గుర్తు చేశారు. అంత మాత్రం చేత తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని అన్నారు. పరిశ్రమలు మనకు కావాలి అందే సమయంలో కాలుష్యం కూడా లేకుండా చూడాలి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అయితే చూడాలి అందుకే కొంత సమయం అడుగుతున్నాను అని పవన్ అన్నారు. వంద రోజుల పాటు కనుక సమయం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సవాల్ గా మారిందా :

ఇదిలా ఉంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మత్య్సకారుల సమస్యలు సవాల్ గా మారాయా అన్నది చర్చగా ఉంది. స్థానికంగా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు వారంతా సముద్ర జలాలు కలుషితం అయిపోవడంతో సముద్ర సంపద నశించి వేట సాగక నానా అవస్థలు పడుతున్నారు. వారంతా ఈ మధ్యనే ఉద్యమించారు. అయితే పవన్ తాను వస్తాను వారి మొర ఆలకిస్తాను అని చెప్పిన దానికి కట్టుబడి విరమించారు. చెప్పినట్లుగానే పవన్ వచ్చారు. వారి బాధలు పూర్తిగా విన్నారు అదే సమయంలో పూర్తి స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తాను అని ఆయన చెబుతున్నారు.

సమగ్రమైన ప్రణాళికగా :

తనకు వంద రోజుల సమయం ఇస్తే సమగ్రమైన ప్రణాళికతో వచ్చి మత్య్సకారులకు సమస్య అన్నది లేకుండా చేస్తాను అని పవన్ చెప్పడం జరిగింది. ఇక ఉప్పాడ ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యానికి సంబంధించి కాలుష్య ఆడిట్ నిర్వహించి వారం రోజుల లోపల నివేదిక సమర్పించాలని ఆయన పీసీబీ అధికారులను ఆదేశించారు. అంతే కాదు తానే స్వయంగా కాలుష్య పరిస్థితిని అంచనా వేస్తాను నై కేవలం మూడు నాలుగు రోజుల వ్యవధిలో కలుషితమైన సముద్ర తీర ప్రాంతాలను వ్యక్తిగతంగా సందర్శిస్తాను అని ఆయన హామీ ఇచ్చారు.

తీర భద్రతకు రక్షణ గోడ :

అదే విధంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో మాట్లాడి తీర ప్రాంత భద్రత కోసం ఉప్పాడ వద్ద రక్షణ గోడను పెద్ద ఎత్తున నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక వేటకు వెళ్ళి మరణించిన మత్స్యకార కుటుంబాలకు ఆయన ఒక్కొక్కరికీ అయిదు లక్షల వంతున పరిహార మొత్తాలని చెల్లించారు. అలా వాటిని అందుకున్న వారిలో 18 కుటుంబాలు ఉంటే 90 లక్షల రూపాయలను వారికి ఆయన చెల్లించడం జరిగింది. మొత్తానికి ఉప్పాడ ఇష్యూ ఒక విధంగా పవన్ కి ఎదురు గాలి వీచేలా చేసింది అని అనుకుంటే పవన్ అక్కడకి వచ్చి మత్య్సకారుల మనసు గెలుచుకున్నారు అని అంటున్నారు. తాను చెప్పినట్లుగా చేయకపోతే రాజకీయాల్లో ఉండను అన్న ఒక్క మాట వారికి ఆయనలో నిజాయతీ ఏమిటి అన్నది తెలియచేసింది అని చెప్పాలి.

Tags:    

Similar News