విశాఖలో పవన్ మకాం

గత ఏడాదిలో పవన్ విశాఖ వేదికగా సైన్యంతో సేనాని అన్న పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆ సమయంలో మూడు రోజుల పాటు విశాఖలో గడిపారు.;

Update: 2026-01-29 03:53 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన చేపట్టారు. ఆయన బుధవారం ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించి వివిధ అంశాల మీద చర్చించారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా పవన్ భేటీ అయి ఏపీ రాజకీయాల గురించి వర్తమాన పరిస్థితుల గురించి చర్చించారు. అనంతరం ఆయన అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం విమానంలో చేరుకున్నారు.

మూడు రోజుల పాటు :

విశాఖలో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు అని చెబుతున్నారు. ఆయన అధికారిక అనధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు అని అంటున్నారు. అదే విధంగా పార్టీ నేతలతో కూడా మీట్ అవుతారని చెబుతున్నారు.

కొంత విరామం తరువాత :

గత ఏడాదిలో పవన్ విశాఖ వేదికగా సైన్యంతో సేనాని అన్న పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఆ సమయంలో మూడు రోజుల పాటు విశాఖలో గడిపారు. తిరిగి మళ్లీ మూడు రోజుల పాటు విశాఖలో ఆయన ఉండడంతో జనసేన వర్గాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో తమ సమస్యలను అధినేత దృష్టిలో నేరుగా పెట్టేందుకు కూడా వారు ఆసక్తి చూపిస్తున్నారు.

ఉత్తరాంధ్ర ఫోకస్ :

జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో బలం ఉంది. ఆ తరువాత ఫోకస్ అంతా ఉత్తరాంధ్ర మీదనే ఉంది. 2024 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ ఆరు సీట్లను జనసేన గెలుచుకుంది. దాంతో జనసేన బలం పెరిగింది. అదే విధంగా సంస్థాగతంగా కూడా గతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. ఇక అల్లూరి జిల్లాలో పాడేరు అరకు మీద కూడా జనసేన దృష్టి ఉంది. పవన్ తన పర్యటనల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుని సమీక్షించడమే కాకుండా ఆయా వర్గాలు ప్రాంతాల వారి సమస్యలను తీరుస్తున్నారు. తద్వారా జనసేన వైపు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి.

దిశా నిర్దేశం :

ఇక పవన్ తాజా పర్యటనలో క్యాడర్ కి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. పార్టీని మరింతగా జనంలోకి తీసుకుని పోవాలని ఆయన సూచిస్తారు అని అంటున్నారు. అంతే కాకుండా ఎవరేమిటి అన్నది మధింపు చేయడం పనితీరుని ఆయన స్వయంగా అడిగి తెలుసుకోవడం వంటివి చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు విశాఖలో మకాం వేయడంతో జనసేనలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. మరి పవన్ విశాఖ వేదికగా చేసుకుని పాల్గొనే కార్యక్రమాల గురించి సర్వత్రా ఆసక్తి అయితే ఉంది.

Tags:    

Similar News