అవును.. బంగారం స్టాక్ లేదు

ఎందుకంటే వీటికి తరగు సమస్య ఉండదు. అమ్మకం కూడా చాలా తేలిక. ఈ కారణంగా బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బంగారు షాపుల్లో చాలామంది క్యూ కడుతున్నారు.;

Update: 2026-01-29 04:37 GMT

చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని కొత్త సన్నివేశం హైదరాబాద్ మహానగరంలోని పలు షాపుల్లో చోటు చేసుకుంది. ఇప్పటివరకు పెట్రోల్,, నిత్యవసర వస్తువులు.. ఇలా పలు ఉత్పత్తులకు సంబంధించి నో స్టాక్ అన్న మాట విని ఉంటాం. అందుకు భిన్నంగా ఇప్పుడు బంగారు నాణెలు.. బిస్కెట్లకు నో స్టాక్ అంటున్న వ్యాపారుల మాట హైదరాబాద్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఆకాశమే హద్దుగా దూసుకెళుతున్న నేపథ్యంలో.. చాలామంది స్వల్ప కాల పెట్టుబడులకు బంగారం..వెండిని కొనుగోలు చేస్తున్న ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా తమ పొదుపు మొత్తాల్ని కొందరు.. మరికొందరు అప్పులు తీసుకొని మరీ బంగారం, వెండి మీద పెట్టుబడి పెడుతూ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారంతా బంగారు ఆభరణాల్ని కాకుండా.. బంగారు నాణెల్ని.. బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేస్తున్నారు.

ఎందుకంటే వీటికి తరగు సమస్య ఉండదు. అమ్మకం కూడా చాలా తేలిక. ఈ కారణంగా బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బంగారు షాపుల్లో చాలామంది క్యూ కడుతున్నారు. సాధారణంగా బంగారం.. వెండి ధరలు భారీగా పెరిగిన వేళల్లో షాపుల్లో రద్దీ అన్నది కనిపించదు. అందుకు భిన్నంగా ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. అంతేనా.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని కొన్ని షాపులు అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి. క్యూలైన్లు కూడా ఉంటున్న పరిస్థితి.

దీంతో.. తమ వద్ద ఉన్న బంగారు బిస్కెట్లు.. డాలర్ల స్టాక్ అయిపోయినట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. బంగారం అన్నంతనే నో స్టాక్ అంటున్న వ్యాపారుల సంఖ్య అంతకంతకూ ఎక్కువగా ఉంటోంది. చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం బంగారం..వెండి ట్రేడింగ్ లోకి దిగుతున్నారు. దీంతో. ధరలు భారీగా పెరిగిన వేళ డిమాండ్ అంతే ఎక్కువగా ఉండటమే కాదు.. తొలిసారి నో స్టాక్ అన్న మాట వినిపిస్తున్నపరిస్థితి.

Tags:    

Similar News