ఎన్నికలు లేకుంటే.. 'పవన్' చర్చ వచ్చేదా?
తెలంగాణలో మరోసారి అస్తిత్వ పోరాటం ప్రారంభమైంది. తమ రాష్ట్రాన్ని.. అవమానించారంటూ.. పలువురు నాయకులు.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు.;
తెలంగాణలో మరోసారి అస్తిత్వ పోరాటం ప్రారంభమైంది. తమ రాష్ట్రాన్ని.. అవమానించారంటూ.. పలువురు నాయకులు.. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేతో ప్రారంభమైన ఈ వివాదం.. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వరకు చేరింది. ఏకంగా పవన్ ను క్షమాపణలు చెప్పాలంటూ.. కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అంతేకాదు.. అలా చెప్పకపోతే.. ఒకటో రెండో రోజులు ఆడే పవన్ సినిమాలు అసలు విడుదలకు కూడా నోచుకోవని ఆయన హెచ్చరించారు. తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇక, ఆవు చేలో మేస్తే.. అన్న చందంగా.. పెద్ద నేతలే.. ఈ చిన్న విషయంలో జోక్యం చేసుకుంటే మిగిలిన నాయకులు ఊరుకుం టారా? అన్నట్టుగా చెట్టు కొకరు పుట్టకొకరు అన్నట్టుగా నిన్న మొన్నటి వరకు ఉన్న నాయకులు పవన్‌కల్యాణ్ పుణ్యమా అని.. ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. చిత్రం ఏంటంటే.. తెలంగాణ గురించి ఎవరైనా ఏమైనా అంటే.. ఒకప్పుడు నిప్పులు చెరిగిన బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పవన్‌కల్యాణ్ విషయంలో మౌనంగా ఉంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం వకాల్తా పుచ్చుకున్నట్టుగా ఈ విషయంలో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
ఇక, ఈ వ్యవహారంపై రాజకీయ చర్చ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉన్నందునే.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కాంగ్రెస్‌నేతలు పెద్దవి చేస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యలను పెద్దవి చేసి చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. గతంలో తెలంగాణ కవులు.. కాళోజీ నారాయణరావు వంటివారిని పవన్ పబ్లిక్‌గా కొనియాడారని.. అదేవిధంగా కొమరం భీమ్ వంటి వారిని వేనోళ్ల కొనియాడిన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. అధికారంలో లేనప్పుడు.. కాకినాడ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు.
''తెలంగాణ ప్రజలకు గుండె ధైర్యం,పౌరుషం ఎక్కువ.. ఇక్కడి(ఏపీ) వారికి అవి ఉంటే.. '' అంటూ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు మరిచిపోయారా? అని విశ్లేషకులు తెలంగాణ వారిని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సమరం కొనసాగుతున్న నేపథ్యంలో అస్తిత్వాన్ని పార్టీలకు అనుకూలంగా మార్చుకునేందుకు.. ప్రజల భావోద్వేగాలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న వాదనను పరిశీలకులు చెబుతున్నారు. అయినా.. కోనసీమ కొబ్బరి చెట్లకు ప్రత్యేక తెలంగాణకు పవన్ కల్యాణ్ ముడి పెట్టలేదని.. మాట వరసగానే అన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.