వైసీపీ విషయంలో పవన్ స్టాండ్ మారిందా ?

వైసీపీని అధికారంలోకి రానిచ్చేదు లేదు అంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.;

Update: 2026-04-17 23:30 GMT

వైసీపీని అధికారంలోకి రానిచ్చేదు లేదు అంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన 2014లో తాను పార్టీ పెట్టినా పోటీ చేయకపోవడానికి కారణం వైసీపీని అధికారంలోకి రానీయకూడదనే అని ఆ రోజుల్లో అనేక సార్లు బాహాటంగానే చెప్పేశారు. ఇక 2019లో టీడీపీ అధికారంలో ఉంది. పవన్ విడిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కువగా వైసీపీని విమర్శించారు అన్నది ఉంది అధికార టీడీపీని పక్కన పెట్టేసి వైసీపీని గట్టిగా టార్గెట్ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో విపక్ష ఓట్లను చీల్చి మరోసారి బాబుని గెలిపించడానికే పవన్ విడిగా పోటీ చేశారు తప్పించి ఆయనకు టీడీపీతో విభేదాలు ఏమీ లేవని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది.

కూటమి కట్టడం వెనక :

మరో వైపు చూస్తే 2024 ఎన్నికలకు ముందు పవన్ కూటమి కట్టారు. టీడీపీ బీజేపీలను ఆయన కలిపారు. ఆ విధంగా బలమైన కూటమి తయారైంది. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లకే పరిమితం చేసింది. ఈ దెబ్బకు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. మరో మూడేళ్లలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అయితే సందర్భం దొరికిన ప్రతీ సారీ వైసీపీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే జనసేనలోని కీలక నేతలు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. దాంతో తాజాగా జరిగిన పార్టీ అధికార ప్రతినిధుల సమావేశంలో పవన్ మాట్లాడుతూ వైసీపీ మీద విమర్శలు గట్టిగా చేయాల్సిందే అని ఆదేశించారు.

మాటకు మాట :

వైసీపీ చేసే ప్రతీ విమర్శకూ జనసేన తరఫున జవాబు చెప్పాల్సిందే అని పవన్ కోరారు. అంతే కాదు ప్రభుత్వం పరంగా ఏమి చేశామో చెప్పాలని కూడా సూచించారు. వైసీపీ చేసే రాజకీయ విమర్శలకు కచ్చితంగా కౌంటర్లు ఇచ్చి తీరాల్సిందే అని కూడా ఆయన చెప్పడం విశేషం. వైసీపీని ఎక్కడా స్పేర్ చేయాల్సిన అవసరం లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరూ కూడా ఉదాశీనంగా ఉండరాదని పవన్ స్పష్టం చేశారు.

కూటమిలో జనసేన :

కూటమిలో జనసేన భాగస్వామ్యంగా ఉందన్న సంగతిని అంతా గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారని చెబుతున్నారు కేవలం టీడీపీ మాత్రమే కూటమి కాదని చెప్పారు. అందువల్ల ప్రభుత్వాన్ని అంటే జనసేన తరఫున కూడా గట్టిగా జవాబు చెప్పే స్థాయిలో పార్టీ నేతలు ఉండాలని అన్నారు. సబ్జెక్ట్ తోనే వైసీపీకి జవాబు చెప్పాలి కానీ అనుచిత పదాలు వాడవద్దని భాష విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వైసీపీ వారు మాదిరిగా మాట్లాడవద్దని కూడా దిశా నిర్దేశం చేశారు.

పవన్ వైఖరి మీద :

ఏపీలో పదిహేనేళ్ళ పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలి అన్న తన వైఖరి మీద పవన్ గట్టిగా నిలబడ్డారు అని అంటున్నారు. ఆయన రెండవ మాటకు తావు ఇవ్వడం లేదు జనసేనకు కలిగే రాజకీయ లాభ నష్టాలను కూడా ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, ఏపీలో వైసీపీని మళ్ళీ అధికారంలోకి రానీయకూడదు అన్న తన పాత స్టాండ్ కే పవన్ కట్టుబడి ఉన్నారని మరోసారి తేటతెల్లం అయింది అంటున్నారు. పవన్ చెప్పారు కాబట్టి ఇక మీదట జనసేన నేతలు వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడే అవకాశం ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News