భీమవరంలో పేకాట శిబిరాలు.. పవన్ సీరియస్.. డీజీపీకి ఆదేశం

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై విస్తృత ఫిర్యాదులు అందాయి.;

Update: 2025-10-21 15:09 GMT

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయనీ, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు వాడుతున్నారనే ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి చేరాయి. అంతేకాకుండా సివిల్‌ వివాదాల్లో డీఎస్పీ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, భీమవరం డీఎస్పీ వ్యవహార శైలిపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటం క్షమించరానిదని ఆయన హెచ్చరించారు. పోలీసులు చట్ట పరిధిలోనే ఉండి, సివిల్‌ వివాదాల్లో తలదూర్చరాదని, ప్రజలందరినీ సమదృష్టితో చూసి శాంతిభద్రతలను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రికీ, రాష్ట్ర డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పేకాట శిబిరాలపై ఫిర్యాదులు : డీజీపీకి నివేదిక కోరిన పవన్ కల్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇటీవల పలు జిల్లాల నుంచి పేకాట శిబిరాల నిర్వహణపై విస్తృత ఫిర్యాదులు అందాయి. కొందరు ప్రభావశీలులు జూద కేంద్రాలు నడుపుతూ నెలవారీ మామూల్లు పోలీసు అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు లభించాయి. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా ఈ వ్యవహారంపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా నడుస్తున్న జూద కేంద్రాలపై డీజీపీ నుండి పూర్తి నివేదిక కోరారు.

ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ – 1974 ప్రకారం, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ రూపంలో జూదం ఆడటం, నిర్వహించడం లేదా ప్రోత్సహించడం నేరమని చట్టం స్పష్టంగా పేర్కొంటుంది. అయినప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అందుతున్నాయి.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, పోలీసు శాఖలో ఎవరైనా ఈ అక్రమాలకు అండగా ఉంటే వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సందేశం

“ప్రజల భద్రతే ప్రభుత్వ ధ్యేయం. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరూ అండగా ఉండరాదు. చట్టం అందరికీ సమానమే.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూద శిబిరాలపై కఠిన చర్యలు చేపట్టాలని, పోలీసులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన సూచనలతో జిల్లాల పోలీసు శాఖల్లో చురుకుదనం పెరిగిందని సమాచారం.

Tags:    

Similar News