"కోనసీమకు చాలా దిష్టి తగిలింది.. రాష్ట్ర విభజనకు కారణమైంది.." పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో? మోడువారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతో నిలబడినట్టు ఉంటుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.;

Update: 2025-11-26 16:47 GMT

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా రైతులతో వారి సమస్యలపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి.. కోనసీమ అందాలు, రాష్ట్ర విభజన, తాను సినిమాలు చేయడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన సందర్భంలో పవన్ వెలిబుచ్చిన అభిప్రాయాలు సభికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ అవుతోంది.

‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా గోదావరి జిల్లాల పచ్చదనమే.. ఆ శాపమే తగిలేసింది. తెలంగాణ నాయకులు అంతా అంటుంటారు. కొబ్బరి చెట్లు, పచ్చదనంతో చాలా ఆనందంగా ఉంటుందని, బాగుంటుందని అనేవారు. నరుడి దృష్టికి నల్ల రాయి అయినా పగిలిపోతుందని అంటారు. నాకు కూడా అలానే అనిపిస్తోంది. కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్లలో పడిందో..? కొబ్బరి చెట్ల పచ్చదనం అంతా పోయి మొండేళ్లుగా మిగిలిపోయాయి. దీనిని కరెక్టు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి.

ఇక్కడ పచ్చని కొబ్బరి చెట్లను చూసే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చిందేమో? మోడువారిన కొబ్బరి చెట్లను చూస్తుంటే ఎదిగిన కొడుకు మొండెంతో నిలబడినట్టు ఉంటుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎదిగిన కొడుకు ఎంత సంపాదిస్తాడో తెలియదు. పెరిగిన కొబ్బరి చెట్టు మాత్రం ఆదాయం ఇస్తుంది. ఎకరం భూమిలో కొబ్బరి తోట ఉంటే రూ. 2 లక్షల ఆదాయం వస్తుంది. కొబ్బరి రైతుకు ఆ ఆదాయం శాశ్వతం కావాలి. 14 ఏళ్లుగా శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఉంది. 14 రోజుల్లో పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. చికిత్స కంటే నివారణ మేలు అన్న పెద్దల మాటను ఆచరణలో పెట్టేవాడిని. శంకరగుప్తం డ్రెయిన్ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతాం అంటూ పవన్ హామీ ఇచ్చారు.

ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడే కోనసీమ ప్రాంతంలో ఇప్పుడు ఆ వైభవం కోల్పోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు. కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదు. కోనసీమ కొబ్బరి రైతాంగం సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తాం’ అని పవన్ హామీ ఇచ్చారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు.

మోడుబారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఎన్నేళ్లుగా ఉంది? సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది? శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? డ్రెయిన్ ఏమైనా ఆక్రమణలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ , ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు. కొబ్బరి తోటలకు తిరిగి పునరుజ్జీవం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు. అనంతరం పంటలు నష్టపోయిన 13 గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.

Tags:    

Similar News