రైతు సేవలో పవన్.. జగన్.. ఇద్దరు ముఖ్య నేతలు ఏం చేశారంటే?

ఇటు పవన్, అటు జగన్ ఒకేసారి రైతు సమస్యలపై కదలడం యాదృచ్ఛికమే అయినా, ఇద్దరి మాటలు రైతుల్లో భరోసా నింపాయని అంటున్నారు.;

Update: 2025-11-26 16:51 GMT

రాష్ట్రంలోని అధికార, విపక్షాలకు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు పొలంబాట పట్టడం ఆసక్తి రేపింది. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ రాజ్యాంగ దినోత్సవం, పిల్లల మాక్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారంతోపాటు పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటు విపక్ష నేత, మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో అరటి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట పట్టారు.

ఇటు పవన్, అటు జగన్ ఒకేసారి రైతు సమస్యలపై కదలడం యాదృచ్ఛికమే అయినా, ఇద్దరి మాటలు రైతుల్లో భరోసా నింపాయని అంటున్నారు. ప్రధానంగా కొబ్బరి సమస్యపై పవన్ మాట్లాడిన మాటలు రైతులకు కొత్త జీవితాన్ని ప్రసాదించేలా ఉన్నాయని అంటున్నారు. అటు జగన్ కూడా అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా వ్యవహరించారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు.

45 రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని పవన్ హామీ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ తో మళ్లీ రైతుల ముందుకు వస్తానని హామీ ఇచ్చారు. కోనసీమ కొబ్బరి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోందని, ఇక్కడ కోకోనట్ ప్రాంతీయ కార్యాలయం స్థానంలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఇక ఓఎన్జీసీ కార్యకలాపాలు కూడా కొబ్బరి పంటకు సమస్యగా మారిందన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయని తెలుసుకున్న పవన్, ఈ విషయంలో 21 మంది ఎంపీలతో కలసి కేంద్రంతో చర్చిస్తామన్నారు. సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

పవన్ ఇలా కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతుల్లో ధైర్యం నింపేలా పర్యటించగా, అటు కడప జిల్లాలోని అరటి రైతుల పరామర్శకు బ్రాహ్మణపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా అరటిని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో అనంతపురం నుంచి ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్ల ద్వారా 3 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశామని జగన్ తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అరటి రైతులను గాలికొదిలేసిందని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో టన్ను అరటికి రూ.30 వేల ధర పలికేదని.. ఇప్పుడు కనీసం రూ.2 వేలకు కూడా ఎవరూ కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జగన్ పర్యటనకు ముందే ప్రభుత్వం అప్రమత్తమైంది. వైసీపీ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రం నుంచి బెంగళూరుకు అరటి ఎగుమతులు చేసేలా వ్యాపారులతో చర్చలు జరిపింది. ప్రస్తుతం రూ.7 వేల చొప్పున అరటి విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో డిసెంబరులో సీజన్ ప్రారంభం అవుతుందని, ఈ సారి మన వద్ద ముందే దిగుబడి రావడంతో ధర తక్కువగా ఉంటోందని వివరణ ఇస్తోంది. వచ్చేనెల నుంచి మార్కెట్లో అరటి రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇద్దరు ప్రధాన నేతలు ఒకే రోజు రైతాంగం సమస్యలపై కదలడం రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిందని అంటున్నారు.

Tags:    

Similar News