రాష్ట్ర విభజనపై పవన్ హాట్ కామెంట్స్.. తెలంగాణవాదుల విమర్శలపై క్లారిటీ
ఢిల్లీ వేదికగా జరుగుతున్న జనసేన పార్టీ సమావేశంలో రాష్ట్ర విభజనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న జనసేన పార్టీ సమావేశంలో రాష్ట్ర విభజనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరుపైనే తనకు ఆవేదన ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చాలాసార్లు తాను చెప్పానని పవన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏనాడు అడ్డు చెప్పలేదని వ్యాఖ్యానించారు. 2009 నుంచి ఇదే విషయాన్ని చెబుతున్నానన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరు ఒక అసంతృప్తిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పటికీ అపోహలు నెలకొన్నాయన్నారు. హైదరాబాద్ లో తన సభకు అనుమతి ఇవ్వకపోవడం కూడా ఇందులో భాగమేనన్నారు.
ఢిల్లీ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా తనపై తెలంగాణ వాదులు చేస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చేందుకు పవన్ ప్రయత్నించారని అంటున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో తన రాజకీయ కార్యకలాపాలను అడ్డుకునేలా జరుగుతున్న ప్రయత్నాలను పవన్ పరోక్షంగా ఎత్తిచూపారని అంటున్నారు. ఢిల్లీ వేదికగా సభ పెట్టడానికి ఇదే కారణమై ఉండొచ్చని అంటున్నారు. మరోవైపు జనసేన పార్టీని స్థాపించి విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పవన్ కల్యాణ్ ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేశామని ఆయన పేర్కొన్నారు.
జనసేన కేవలం అధికారం చేపట్టాలనే స్వార్థంతో పుట్టిన పార్టీ కాదని పవన్ స్పష్టం చేశారు. దేశ సమగ్రత, జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడటమే జనసేన పరమావధిగా అభివర్ణించారు. పార్టీ బాగుపడటం కంటే.. దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వడమే మా సిద్ధాంతమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వంత మనుగడ కోసం, రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను సైతం ప్రమాదంలో పడేస్తున్నాయని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఢిల్లీ మెడలు వంచుతామన్న నేతలపై ఫైర్
స్థానికంగా ఉంటూ సొంత రాష్ట్రాల్లో "ఢిల్లీ మెడలు వంచుతాం.. కేంద్రానికి లొంగేది లేదు" అంటూ ప్రగల్భాలు పలికే నాయకులను పవన్ కల్యాణ్ తన శైలిలో కడిగిపారేశారు. "ఇక్కడ గల్లీల్లో ఉండి ఢిల్లీ మెడలు వంచుతామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే వారు.. తీరా ఢిల్లీకి రాగానే కనీసం నోరు కూడా విప్పరు, వారి నోళ్లు పెగలవు" అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని ఢిల్లీలోనే ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందో కూడా పవన్ కల్యాణ్ వివరించారు. ఢిల్లీ అనేది దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రమని ఆయన అన్నారు. మహామహులైన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, బలిదానాలకు నిలయమైన పవిత్ర భూమి ఇదని కొనియాడారు. మన దేశ సర్వోన్నత చట్టం, భారత రాజ్యాంగం పుట్టిన చోటు కాబట్టే.. జాతీయ సమగ్రతపై చర్చించడానికి ఈ వేదికను ఎంచుకున్నట్లు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.