అసెంబ్లీలో బోండా ఉమ Vs పవన్.. "పొల్యూషన్" ఫైట్
బోండా ఉమ వ్యాఖ్యలకు తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు.;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పరిశ్రమల కాలుష్యం, ప్లాస్టిక్ నియంత్రణ అంశాలపై శుక్రవారం జరిగిన చర్చ ఉద్రిక్తంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా.., డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
బోండా ఉమ ఆరోపణలు
టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల కాలుష్యం నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విజయవాడలో కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) కార్యాలయమే లేదని, దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే "డిప్యూటీ సీఎం వద్ద నుంచి చెప్పించండి" అని చెబుతున్నారని ఆరోపించారు. అంతేకాకుండా బోర్డు చైర్మన్ ఒక అధికారిగా కాకుండా రాజకీయ సూచనలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
పవన్ కళ్యాణ్ కౌంటర్
బోండా ఉమ వ్యాఖ్యలకు తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని సూచించారు. "పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందుబాటులో ఉండదని చెప్పడం సరైంది కాదు. మా శాఖ ఇప్పటికే రాంకీ సంస్థపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. కానీ, ఒక సంస్థను లేదా వ్యక్తిని కావాలని లక్ష్యంగా చేసుకోకూడదు" అని ఆయన స్పష్టం చేశారు.
పర్యావరణం-పరిశ్రమల సమన్వయం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటే ఎన్ని కంపెనీలు మూతపడతాయో మనకు తెలియదని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిశ్రమల ఉనికిని కూడా సమన్వయం చేయడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఈ అంశంపై తమ శాఖ మూడు నెలల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుందని కూడా తెలిపారు.
మొత్తం మీద, ఈ సంఘటన అసెంబ్లీలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్చలో పర్యావరణం.. పారిశ్రామికాభివృద్ధి అనే రెండు ముఖ్యమైన అంశాలు ముందుకు వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాదోపవాదాలకు దారితీసింది.