'గూడెం' యూటర్న్.. 'కారు'లో చోటుందా?.. కేసీఆర్ నిర్ణయమేంటి?
గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్‌చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే. గత కొన్నాళ్ల కిందట ఈయన వ్యవహారం ఆసక్తిగా మారింది.;
గూడెం మహిపాల్ రెడ్డి. పటాన్‌చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే. గత కొన్నాళ్ల కిందట ఈయన వ్యవహారం ఆసక్తిగా మారింది. 2023లోనే కాదు.. గతంలోనూ ఆయన పటాన్ చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నారు. అయితే.. ఆయన 2023 ఎన్నికల అనంతరం.. పార్టీ మారిపో యారు. నేరుగా బీఆర్ ఎస్‌పైనే విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకొన్నారు.
ఇక, ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితాలో చేరిపోవడంతో కేసీఆర్.. ఇతర ఎమ్మెల్యేలతోపాటు ఈయనపైనా అనర్హత వేటు వేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం స్పీకర్ వద్ద ఉంది. నాటి స్పీకర్ విచారణలో మహిపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు కదా.. బీఆర్ ఎస్‌లో ఉన్నానని ఎలా చెబుతున్నారు`` అన్న ప్రశ్న.. ``అది కాంగ్రెస్ కండువనా.. అట్లేమీ లేదే.. జాతీయ జెండా లెక్క ఉండె. అందుకే మెడలో ఏసుకున్న`` అంటూ.. తనదైన స్లాంగ్‌లో వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. కాంగ్రెస్ పెద్దలు ఎలా ఉన్నా.. మహిపాల్ రెడ్డికి స్థానిక నాయకులు సెగ పెంచారు. ఆయన కార్యాలయంలో సోనియాగాంధీ, రేవంత్ రెడ్డి ఫొటోలు పెట్టాలని.. ఇంటిపై కాంగ్రెస్ జెండాఎగరేయాలని డిమాండ్ చేశారు. దీంతో పడలేక.. ఆయన కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఇదే విషయాన్ని బహిరంగంగా కూడా ప్రకటించారు. కానీ.. అప్పటికే బీఆర్ ఎస్ అధినేత తాను చేయాల్సిన పని పూర్తి చేశారు. పటాన్ చెరు నియోజకవర్గానికి ఆదర్శ్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. ఇటీవలి కాలంలో ఆయనే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తిరిగి కారెక్కేందుకు?
ఇదిలావుంటే.. మహిపాల్ రెడ్డి తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మునిసిపాలిటీలను బీఆర్ ఎస్‌కు దక్కేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా ఇస్నాపూర్‌లో తన ఎక్స్ అఫిషియో ఓటు వేసి.. చైర్మన్ గిరీని కూడా బీఆర్ ఎస్‌కు దక్కేలా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ ఎస్ గూటికి తిరిగి వచ్చేందుకు మహిపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు.
కానీ, ఇప్పటికే బీఆర్ ఎస్‌పై విమర్శలు చేయడం.. కాంగ్రెస్ కండువాను కూడా కప్పుకొన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. చిత్రం ఏంటంటే.. మహిపాల్ రెడ్డి బ్రదర్ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. కానీ.. స్థానిక నాయకులు మాత్రం గూడెంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన మునిసిపాలిటీని దక్కించేలా ప్రయత్నించినా వారు గతాన్ని తవ్వుతున్నారు. అనర్హత వేటుకు భయపడే గూడెం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.