నదీ గర్భంలో నక్కతోక... పాకిస్థాన్ కు దరిద్రం మొత్తం తీరిబోతోతుందా?
పాకిస్థాన్ దేశం ప్రస్తుతం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.;
పాకిస్థాన్ దేశం ప్రస్తుతం ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. దేశంలోని విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఖాళీ స్థలాలూ అద్దెకు ఇచ్చుకుని బండి నడపాల్సిన పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తుంటాయి అయితే పాకిస్థాన్ తాజాగా నక్కతోక తొక్కిందని.. అంతా అనుకూలంగా జరిగితే ఆ దేశానికి ఉన్న అప్పులన్నీ ఒక్క దెబ్బతో తీరిపోయే అవకాశం ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ఆ కష్టాలు తీరిపోయే రోజు దగ్గరలోనే ఉందనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తర్బెలా ఆనకట్ట నేలలో సుమారు 636 బిలియన్ డాలర్ల విలువైన బంగారు నిల్వలు కనుగొనబడ్డాయని ఎయిర్ కరాచీ ఛైర్మన్, ఫెడరేషన్ ఆఫ్ పాకిస్థాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హనీఫ్ గోహార్ అన్నారు.
కరాచీ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడిన గోహార్... ఈ విషయాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ లకు అధికారికంగా తెలియజేసినట్లు తెలిపారు. ఈ బ్రీఫింగ్ కు వారిరువురూ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఇటీవల ఆనకట్ట లోపల నుంచి డ్రైవర్లు మట్టి నమూనాలను సేకరించారని.. అందులో బంగారం శాతాన్ని కనుగొనడానికి వాటిని ప్రయోగశాలకు పంపి విశ్లేషించినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఆ ఫలితాలను అంచనా వేయడం ద్వారా ఆనకట్ట నేలలో ఉండే బంగారం మొత్తం విలువ సుమారు 636 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడిందని గోహర్ అన్నారు. ఇది పాకిస్తాన్ జాతీయ రుణాన్ని తీర్చగలదని తెలిపారు. ఈ క్రమంలో... వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ ప్రాజెక్టును స్వయంగా చేపట్టాలని.. అలా కాని పక్షంలో తన కంపెనీ పెట్టుబడి పెట్టడానికి, బంగారాన్ని వెలికితీసి దేశానికి అప్పగించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఈ విషయంలో ముందుకు వెల్లడానికి తన బృందం సిద్ధంగా ఉందని.. హాలండ్ లోని డ్రెడ్జింగ్ నిపుణులతో పాటు కెనడాలోని భాగస్వాములతో ఇప్పటికే దీనిపై చర్చలు జరిపిందని అన్నారు. ప్రభుత్వం తమకు అనుమతి ఇస్తే.. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గోహార్ వెల్లడించారు.
కాగా... జూన్ 2025 నాటికి పాకిస్తాన్ మొత్తం అప్పు $286.832 బిలియన్లకు (పాక్ రూపీస్ 80.6 ట్రిలియన్లు) చేరుకున్న సంగతి తెలిసిందే. ఇది మునుపటి సంవత్సరం కంటే దాదాపు 13% ఎక్కువ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన 2025 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక రుణ సమీక్షలో విడుదల చేసిన అధికారిక డేటా తెలిపింది. ఇందులో దేశీయ అప్పు పాకిస్థాన్ రూపాయి 54.5 ట్రిలియన్లు కాగా.. బాహ్య అప్పు పాకిస్థాన్ రూపాయి 26.0 ట్రిలియన్లు అని తెలిపింది.