పాకిస్థాన్ మారుతోంది.. పాస్‌పోర్ట్ మార్చుకుంటోందా?

సాధారణంగా పాకిస్థాన్ రాజకీయ నాయకులకు యూ-టర్న్‌లు తీసుకోవడం కొత్తేమీ కాదు.

Update: 2026-05-27 06:05 GMT

ఇప్పటివరకు అంతర్జాతీయంగా కొన్ని బ్రాండ్స్ చూడగానే గుర్తుపట్టేయొచ్చు. అలాగే పాకిస్థాన్ పాస్‌పోర్ట్ చూడగానే ప్రపంచానికి గుర్తొచ్చేది అందులో ఉండే ఒకే ఒక్క లైన్ (ఇజ్రాయెల్ మినహా ఈ పాస్‌పోర్ట్ ప్రపంచంలోని అన్ని దేశాలకూ వర్తిస్తుంది అని ఉంటుంది. అసలు ఈ లైన్ లేకపోతే అది పాక్ పాస్‌పోర్టే కాదనే రేంజ్‌లో దశాబ్దాలుగా ఒక సెంటిమెంట్ నడుస్తోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది... "ఆ పాత లైన్‌కు గుడ్‌బై చెప్పే టైమ్ వచ్చేసిందా బాస్?" అని.. దీనికంతటికీ కారణం అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మార్క్ ‘డీల్ మేకింగ్’ జిత్తులు.

ట్రంప్ తాత ఎంట్రీ... ‘అబ్రహం అకార్డ్స్’ గాండ్రీ!

మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-అరబ్ దేశాల మధ్య దోస్తీ కుదర్చడానికి ట్రంప్ తెచ్చిన మాస్టర్ ప్లానే ‘అబ్రహం అకార్డ్స్’. ఇప్పటికే కొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో చేతులు కలపగా ఇప్పుడు పాకిస్థాన్‌ను కూడా ఈ క్లబ్‌లోకి లాగాలని ట్రంప్ గట్టిగానే ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో పాక్ విదేశాంగ శాఖలో అంతర్గతంగా వణుకు మొదలైందనేది ఇన్‌సైడ్ టాక్. ఎందుకంటే అబ్రహం అకార్డ్స్‌పై సంతకం పెట్టడమంటే... పాస్‌పోర్ట్‌లోని ఆ "యాంటీ-ఇజ్రాయెల్" లైన్‌ను ఎరేజర్‌తో తుడిచేసినట్టు తుడిచేయడమే!

యు-టర్న్‌లకే బ్రాండ్ అంబాసిడర్.. కానీ ఈసారి?

సాధారణంగా పాకిస్థాన్ రాజకీయ నాయకులకు యూ-టర్న్‌లు తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ పాలస్తీనా అంశం వస్తే మాత్రం మైక్ దొరికితే చాలు ఐక్యరాజ్యసమితి వేదికల నుంచి లోకల్ గల్లీ సభల వరకు “పాలస్తీనా మా గుండెకాయ” అంటూ దంచికొట్టేసేవారు. అలాంటి దేశం ఇప్పుడు ఒక్కసారిగా ప్లేట్ తిరగేసి ఇజ్రాయెల్‌కు ‘రెడ్ కార్పెట్’ వేస్తే, దాన్ని దేశ ప్రజలకు ఎలా వివరించాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. బహుశా ఎప్పటిలాగే విదేశాంగ మేధావులు రంగంలోకి దిగి... “ఇది యు-టర్న్ కాదు భయ్యా... జియోపాలిటికల్ కంపల్షన్” అంటూ భారీ ఇంగ్లీష్ పదాలతో కవర్ చేసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

సోషల్ మీడియాలో మీమ్స్ పండగ!

ఈ వార్త బయటకు రావడం ఆలస్యం, నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌తో ఊదరగొట్టేస్తున్నారు. “పాస్‌పోర్ట్ ప్రింటింగ్ ప్రెస్‌కు ఇప్పటికే కొత్త ఫాంట్, కొత్త డిజైన్ ఆర్డర్ ఇచ్చేశారా ఏంటి?” “ఒకవేళ 'ఇజ్రాయెల్ పేరు లైన్ తీసేస్తే... పాస్‌పోర్ట్ బుక్‌లెట్‌తో పాటు ఇంకో ఎక్స్‌ట్రా స్టిక్కర్ ఏమైనా ఫ్రీగా ఇస్తారా? ఇన్నాళ్లూ ఇజ్రాయెల్‌ను మ్యాప్‌లోనే లేదన్నారు... ఇప్పుడు నేరుగా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేలా ఉన్నారే!” అంటూ సెటైర్లు వేస్తున్నారు.

‘డాలర్’ కష్టాలు... అంతర్జాతీయ ఒత్తిళ్లు

రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇందులో పెద్ద కామెడీ ఏమీ లేదంటున్నారు. పాకిస్థాన్ ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం, ఐఎంఎఫ్ అప్పుల తిప్పలు, అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం... ఇవన్నీ చూస్తుంటే పాక్‌కు వేరే ఆప్షన్ లేనట్టే కనిపిస్తోంది.

కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. ఇజ్రాయెల్ విషయంలో పాక్ తీసుకునే స్టాండ్ కేవలం విదేశాంగ విధానం మాత్రమే కాదు. అది దశాబ్దాలుగా దేశంలో నడుస్తున్న భావోద్వేగ, మతపరమైన రాజకీయ బ్రాండ్. దీన్ని ఒక్క రాత్రిలో మార్చేస్తే దేశీయంగా తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తడం ఖాయం.

ట్రంప్ మాట వింటే అమెరికా నుండి ఆర్థిక ప్యాకేజీలు, ఐఎంఎఫ్ రుణాలు సులువుగా దొరుకుతాయి. కానీ దేశంలో అంతర్గత కల్లోలం, ‘పాలస్తీనాను ద్రోహం చేశారు’ అనే నిందలు తప్పవు. పాత పంథాలోనే ఉంటే దేశంలో ‘ఇస్లామిక్ సెంటిమెంట్’ సేఫ్‌గా ఉంటుంది, విపక్షాల తిరుగుబాటు తప్పుతుంది. కానీ ఆర్థికంగా మరింత దివాళా తీసే ప్రమాదం.. అంతర్జాతీయంగా ఒంటరి అయ్యే ఛాన్స్ ఉంటుంది.. చివరికి ఏమవుతుందనేది కాలమే నిర్ణయించాలి. పాక్ పాస్‌పోర్ట్‌పై ఉన్న “ఎక్ సెప్ట్ ఇజ్రాయెల్” అనే లైన్ చరిత్రలో కలిసిపోతుందా లేక ట్రంప్ ఒత్తిడిని తట్టుకుని పాత డైలాగే కంటిన్యూ చేస్తారా అనేది సస్పెన్స్.

కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఇస్తున్న అల్టిమేటం ఒకటే “పాస్‌పోర్ట్‌పై లైన్ మార్చడం పెద్ద కష్టం కాకపోవచ్చు గవర్నమెంట్ గారూ... కానీ దశాబ్దాలుగా ప్రజల మైండ్‌సెట్‌లో ముద్రపడిపోయిన లైన్‌ను మార్చడం అంత ఈజీ కాదు బాస్ అంటున్నారు.. చూడాలి మరీ పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంటుందా? పైసల కోసం మత మౌఢ్యం వదులుతుందా? చూడాలి.

Tags:    

Similar News